రెండు సంవత్సరాల ముగిసిన తర్వాత ఫరో కలగన్నాడు: అతడు నైలు నది దగ్గర నిలబడి ఉన్నాడు, నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. వాటి తర్వాత, చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు వాటి ప్రక్కన నైలు నది ఒడ్డున నిలబడ్డాయి. చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు అందంగా పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు.
మళ్ళీ అతడు పడుకున్నాడు, రెండవ కలగన్నాడు: పుష్టిగా, మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కొమ్మకు పెరుగుతున్నాయి. వాటి తర్వాత పీలగా, తూర్పుగాలికి ఎండిపోయిన మరో ఏడు వెన్నులు పెరిగాయి. పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు; అది కల అని గ్రహించాడు.
ఉదయం అతని మనస్సు కలవరపడింది, కాబట్టి ఈజిప్టులోని మాంత్రికులను, జ్ఞానులను అందరిని పిలిపించాడు. ఫరో తన కలలు వారికి చెప్పాడు, కానీ వాటి భావం ఎవరు చెప్పలేకపోయారు.
అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు ఫరోతో అన్నాడు, “ఈ రోజు నా తప్పులు నాకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఫరో ఒకసారి తన సేవకులపై కోప్పడి, నన్ను రొట్టెలు కాల్చేవారి నాయకున్ని అంగరక్షకుల అధిపతి ఇంట్లో నిర్బంధంలో ఉంచారు. మా ఇద్దరికి ఒకే రాత్రి కలలు వచ్చాయి, ఒక్కొక్క కలకు ఒక్కొక్క అర్థం ఉంది. అక్కడ మాతో పాటు ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడు. అతడు అంగరక్షకుల అధికారికి దాసుడు. మా కలలు అతనికి చెప్పాం, అతడు ఎవరి కల భావాన్ని వారికి చెప్పాడు. అతడు వాటిని వివరించినట్టే మాకు జరిగింది: నా స్థానం నాకు తిరిగి వచ్చింది, మరో వ్యక్తి వ్రేలాడదీయబడ్డాడు.”
అప్పుడు ఫరో యోసేపును పిలిపించాడు, వారు అతన్ని చెరసాల నుండి త్వరగా తీసుకువచ్చారు. యోసేపు శుభ్రంగా క్షౌరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో సమక్షంలో నిలబడ్డాడు.
ఫరో యోసేపుతో, “నేనొక కలగన్నాను, దాని భావం ఎవరూ చెప్పలేకపోయారు. కానీ నీవు ఒక కల వింటే దాని భావం చెప్తావని నీ గురించి విన్నాను” అని అన్నాడు.
అందుకు యోసేపు, “నేను చేయలేను, అయితే ఫరోకు క్షేమకరమైన జవాబు దేవుడు ఇస్తారు” అని ఫరోతో అన్నాడు.
అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను, నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. వాటి తర్వాత చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అంత వికారమైన ఆవులను ఈజిప్టులో నేనెప్పుడు చూడలేదు. బక్కగా వికారంగా ఉన్న ఆవులు ముందు వచ్చిన పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. కానీ అవి తిన్నా కూడా అవి తిన్నాయని ఎవరు చెప్పలేరు; అవి ముందు ఉన్నట్లే వికారంగా ఉన్నాయి. అప్పుడు నేను నిద్రలేచాను.
“నా కలలో పుష్టిగా మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కాడకు పెరుగుతున్నాయి. వాటి తర్వాత పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన మరో పీలవెన్నులు వాటి తర్వాత మొలిచాయి. పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. ఇది మాంత్రికులకు చెప్పాను, కానీ దాని అర్థాన్ని చెప్పేవారు ఎవరూ లేరు.”
అప్పుడు యోసేపు ఫరోకు చెప్పాడు, “ఫరో కలల భావం ఒక్కటే. దేవుడు ఏమి చేయబోతున్నారో ఫరోకు తెలియజేశారు. ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు, అలాగే ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరాలు; రెండు కలల భావం ఒకటే. వాటి తర్వాత వచ్చిన చిక్కిపోయి వికారంగా ఉన్న ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు, పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు వెన్నులు కూడా అవే ఏడు సంవత్సరాలు; అవి ఏడు సంవత్సరాలు కరువు కాలము.
“నేను ఫరోకు చెప్పినట్టే జరుగుతుంది. దేవుడు తాను ఏమి చేయబోతున్నారో ఫరోకు చూపించారు. ఈజిప్టు దేశమంతటా గొప్ప సమృద్ధిగల ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి. కానీ వాటి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ సమయంలో ఈజిప్టులో ఉండే సమృద్ధి అందరు మరిచిపోతారు, కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. తర్వాత వచ్చే కరువు ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దేశంలో ఉండిన సమృద్ధి ఎవరికీ జ్ఞాపకం ఉండదు. కల రెండు విధాలుగా ఫరోకు ఇవ్వబడిన కారణం ఏంటంటే ఇది దేవునిచే దృఢంగా నిర్ణయించబడింది, దేవుడు త్వరలో దానిని చేస్తారు.
“ఇప్పుడు ఫరో జ్ఞాన వివేచనలు కలిగిన ఒక వ్యక్తిని ఈజిప్టు అంతటి మీద అధికారిగా నియమించాలి. సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి. వారు ఈ మంచి సంవత్సరాల్లో పండే ధాన్యం సేకరించి ఫరో ఆధీనంలో పట్టణాల్లో ఆహారం ఉండేలా నిలువచేయాలి. ఈ ఆహారం దేశం కోసం నిలువచేయబడి ఈజిప్టు మీదికి వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఉపయోగించబడుతుంది, అప్పుడు కరువు ద్వారా దేశం నాశనం కాదు.”