ఆది 26:1-16

ఆది 26:1-16 TSA

ఆ దేశంలో అబ్రాహాము కాలంలో వచ్చిన కరువు కాక మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోని ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్లాడు. యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు, “నీవు ఈజిప్టుకు వెళ్లకు; నేను చెప్పిన దేశంలోనే నివసించు. కొంతకాలం ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నీ వారసులకు ఈ దేశాలన్నీ ఇస్తాను, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను. నీ వారసులను ఆకాశంలోని అనేక నక్షత్రాల్లా విస్తరింపజేసి ఈ దేశాలన్నీ వారికిస్తాను, నీ సంతానం ద్వారా సమస్త భూప్రజలు ఆశీర్వదించబడతారు, ఎందుకంటే అబ్రాహాము నా మాట విని, నేను చెప్పింది చేశాడు, నా ఆజ్ఞలను, కట్టడలను, సూచనలను పాటించాడు.” కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. అక్కడి మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరు అని అతన్ని అడిగితే, “ఆమె నా సోదరి” అని చెప్పాడు, ఎందుకంటే, “ఆమె నా భార్య” అని చెప్పడానికి భయపడ్డాడు. “రిబ్కా అందంగా ఉంది కాబట్టి తనను బట్టి ఈ స్థలం యొక్క మనుష్యులు నన్ను చంపేస్తారు” అని అతడు అనుకున్నాడు. ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు. కాబట్టి అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, “నిజంగా ఈమె నీ భార్య కదా! ‘ఆమె నా సోదరి’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. ఇస్సాకు, “ఆమె కారణంగా నా ప్రాణం పోతుందేమో అని అనుకున్నాను” అని జవాబిచ్చాడు. అప్పుడు అబీమెలెకు, “నీవు మా పట్ల చేసినదేంటి? ఈ మనుష్యుల్లో ఎవరైనా ఆమెతో శయనించి ఉండేవారు. అప్పుడు నీవు మాపైన అపరాధం తెచ్చిపెట్టేవాడివి” అని అన్నాడు. అప్పుడు అబీమెలెకు ప్రజలందరికి ఆదేశించాడు: “ఎవరైనా ఈ మనుష్యునికి లేదా అతని భార్యకు హాని చేస్తే, వారికి మరణశిక్ష విధించబడును.” ఇస్సాకు ఆ దేశంలో విత్తనాలు విత్తాడు, యెహోవా అతన్ని దీవించారు కాబట్టి, అదే సంవత్సరం అతనికి నూరంతల పంట వచ్చింది. అతడు ధనికుడయ్యాడు, అతడు ఎంతో గొప్పవాడయ్యే వరకు అతని ఆస్తి వృద్ధిచెందుతూ ఉంది. అతనికి మందలు, పశువులు, దాసులు ఎక్కువగా ఉన్నందుకు ఫిలిష్తీయులు అసూయపడ్డారు. అతని తండ్రియైన అబ్రాహాము కాలంలో అతని దాసులు త్రవ్విన బావులన్ని ఫిలిష్తీయులు మట్టితో నింపి పూడ్చేశారు. అబీమెలెకు ఇస్సాకుతో, “నీవు ఇక్కడినుండి వెళ్లిపో; మాకంటే చాలా బలవంతుడవు అయ్యావు” అన్నాడు.

చదువండి ఆది 26

ఆది 26:1-16 కోసం వీడియో