తెల్లవారుజామున ఆ దూతలు లోతుతో, “త్వరగా, ఇక్కడున్న నీ భార్యను, నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని బయలుదేరు లేదా ఈ పట్టణం శిక్షించబడినప్పుడు మీరు కూడా నాశనమవుతారు” అని చెప్పారు. లోతు సంశయిస్తుండగా ఆ మనుష్యులు లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం బయటకు తీసుకువచ్చారు, ఎందుకంటే యెహోవా వారిపై కనికరం చూపారు. వారిని బయటకు తీసుకువచ్చిన వెంటనే, వారిలో ఒకరు, “మీ ప్రాణాల కోసం పారిపోండి! వెనుకకు చూడకండి, మైదానంలో ఎక్కడ ఆగకండి! పర్వతాల వైపు పారిపోండి లేదా మీరు తుడిచివేయబడతారు!” అని చెప్పారు. కానీ లోతు వారితో, “నా ప్రభువులారా! దయచేసి అలా కాదు, మీ సేవకుడు మీ దృష్టిలో దయ పొందాడు, మీ దయ వలన మీరు నా ప్రాణం కాపాడారు. అయితే నేను పర్వతాలకు వెళ్లను; ఈ విపత్తు నా మీదికి వచ్చి నేను చస్తాను. చూడండి, నేను తప్పించుకోడానికి ఇక్కడ ఒక చిన్న పట్టణం ఉంది. దానిలోకి వెళ్లనివ్వండి అది చిన్నగా ఉంది కదా, అప్పుడు నా ప్రాణం రక్షింపబడుతుంది” అని అన్నాడు. ఆ దూత, “మంచిది, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను; నీవు చెప్పే ఈ పట్టణాన్ని నాశనం చేయను. కాని అక్కడికి త్వరగా పారిపోండి, ఎందుకంటే మీరు అక్కడికి చేరేవరకు నేను ఏమి చేయలేను” అని అన్నాడు. అందుకే ఆ పట్టణానికి సోయరు అని పేరు పెట్టబడింది. లోతు సోయరు చేరే లోపు ఆ ప్రాంతంలో సూర్యుడు ఉదయించాడు. అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురిపించారు; యెహోవా దగ్గర నుండి ఆకాశం నుండి అవి కురిపించబడ్డాయి. అలా ఆయన ఆ పట్టణాలను, ఆ మైదానమంతటిని ఆ పట్టణాల్లో నివసించే వారినందరిని ఆ ప్రాంతంలో ఉన్న నేల మొలకలతో సహా నాశనం చేశారు. అయితే లోతు భార్య వెనుకకు తిరిగింది, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి అంతకుముందు యెహోవా ఎదుట తాను నిలిచిన స్థలానికి వెళ్లాడు. సొదొమ గొమొర్రాల వైపు, ఆ మైదానమంతటిని చూశాడు, ఆ స్థలం నుండి కొలిమిలో నుండి వచ్చే పొగలా పొగ రావడం చూశాడు. దేవుడు మైదానంలోని పట్టణాలను నాశనం చేసినప్పుడు, ఆయన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నారు, లోతును, తాను నివసించిన ఆ పట్టణాలను పడగొట్టిన విపత్తు నుండి అతన్ని తప్పించారు.
చదువండి ఆది 19
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆది 19:15-29
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు