అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి. అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నీ సంతతిని అత్యధికంగా వర్ధిల్లజేస్తాను” అన్నారు. అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు, “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు. ఇకమీదట నీ పేరు అబ్రాము కాదు; నీకు అబ్రాహాము అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను. నిన్ను ఎంతో ఫలభరితంగా చేస్తాను; నిన్ను అనేక జనాంగాలుగా చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు. నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను. నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.” అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవైతే, నీవు, నీ తర్వాత నీ సంతానం తరతరాల వరకు నా నిబంధనను నిలుపుకోవాలి. నీకు నీ తర్వాత నీ సంతతివారికి నేను చేసే నా నిబంధన, మీరు నిలుపుకోవలసిన నిబంధన ఇదే: మీలో ప్రతి మగవాడు సున్నతి చేసుకోవాలి. మీకు నాకు మధ్య నిబంధన గుర్తుగా మీ గోప్య చర్మాన్ని సున్నతి చేసుకోవాలి. రాబోయే తరాలలో ఎనిమిది రోజుల వయస్సున్న ప్రతి మగబిడ్డకు అంటే మీ ఇంట్లో పుట్టినవారైనా మీ సంతతి కాక విదేశీయుల నుండి కొనబడినవారైనా సున్నతి చేయబడాలి. మీ డబ్బుతో కొనబడినవారైనా, వారికి సున్నతి చేయబడాలి. మీ శరీరంలో నా నిబంధన నిత్య నిబంధనగా ఉండాలి. సున్నతి చేయబడని మగవారు అంటే తన గోప్య చర్మానికి సున్నతి చేయబడనివారు తమ జనులలో నుండి బహిష్కరించబడాలి; ఎందుకంటే వారు నా నిబంధనను మీరారు.” దేవుడు అబ్రాహాముతో ఇలా కూడా చెప్పారు, “నీ భార్యయైన శారాయిని ఇకపై శారాయి అని పిలువకూడదు; ఇప్పటినుండి తన పేరు శారా. నేను ఖచ్చితంగా ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె ద్వార నీకు కుమారున్ని ఇస్తాను. ఆమె జనాంగాలకు తల్లిగా ఉండేలా తనను ఆశీర్వదిస్తాను; అనేక జనాంగాల రాజులు ఆమె నుండి వస్తారు.”
చదువండి ఆది 17
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆది 17:1-16
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు