నా మాటలను గుర్తు పెట్టుకోండి! పౌలు, అనే నేను చెప్పేది ఏంటంటే, మీరు సున్నతి పొందినవారైతే, క్రీస్తు ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సున్నతి పొందినవారు ధర్మశాస్త్రమంతటికి లోబడి ఉండాలని ప్రతి ఒక్కరితో మళ్ళీ నేను చెప్తున్నాను. ధర్మశాస్త్రం చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నిస్తున్న మీరు క్రీస్తు నుండి దూరం చేయబడ్డారు. మీరు కృపకు దూరమయ్యారు. నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే లెక్కించబడుతుంది.
మీరు మంచి పరుగు పందాన్ని పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు? అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు. “పులిసింది కొంచెమే అయినా అది మొత్తం పిండిని పులియజేస్తుంది.” మీరు మరోలా అనుకోరని ప్రభువులో నేను నమ్మకం కలిగివున్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన మూల్యం చెల్లించాలి. సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది. ఆ ప్రత్యర్థుల విషయానికొస్తే, నేను కోరేదేమిటంటే వారు తమకు తాముగా విడిపోవాలి!
నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు పరిచర్య చేసుకోండి. “నీలాగే నీ పొరుగువారిని ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది. ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకొని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్త పడండి లేదా ఒకరి ద్వారా ఒకరు నాశనం అవుతారు.
కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు. శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కనుక మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు. మీరు ఆత్మ చేత నడిపించబడుతున్నవారైతే, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు.
శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే: లైంగిక దుర్నీతి, అపవిత్రత, వేశ్యాలోలత్వము; విగ్రహారాధన, క్షుద్రవిద్య; ద్వేషం, విరోధం, అసూయ, అధికమైన ఆగ్రహం స్వార్థపూరితమైన ఆశలు, భేదాభిప్రాయాలు, విభేదాలు, మరియు ఓర్వలేనితనం, మత్తు, వెర్రి ఆటలు మొదలైనవి. నేను గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్లుగా ఇలాంటి జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మళ్ళీ హెచ్చరిస్తున్నాను.
అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, మృదుత్వం, స్వీయ నియంత్రణ. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు. యేసుక్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో ఆశలతో సిలువ వేశారు.