ఎజ్రా 6:7-16

ఎజ్రా 6:7-16 TSA

దేవుని ఆలయ పనికి ఆటంకం కలిగించకూడదు. యూదుల అధిపతిని, యూదుల పెద్దలను దేవుని మందిరాన్ని దాని స్థానంలో కట్టనివ్వండి. అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను: యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు. వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి. తద్వారా వారు బలులు అర్పించి పరలోక దేవుని సంతోషపరచి రాజు, అతని కుమారుల క్షేమం గురించి ప్రార్థిస్తారు. అంతేకాక, నా ఆదేశం ఏంటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞ పాటించకపోతే వారి ఇంటి నుండి దూలాన్ని తీసి దానికి వారిని ఉరితీయాలి. ఈ నేరం బట్టి వారి ఇంటిని చెత్తకుప్పగా చేయాలి. ఏ రాజైన ఏ ప్రజలైనా ఈ ఆజ్ఞను మీరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తన నామాన్ని అక్కడ ఉంచిన దేవుడు వారిని పడగొట్టును గాక. దర్యావేషు అనే నేను ఆదేశిస్తున్నాను. దీనిని ఖచ్చితంగా శ్రద్ధతో పాటించాలి. తర్వాత, రాజైన దర్యావేషు పంపించిన శాసనం ప్రకారం, యూఫ్రటీసు నది అవతలి అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు పని చేయించారు. ప్రవక్తయైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జెకర్యాల ప్రవచనాలను బట్టి యూదుల పెద్దలు పనిని సక్రమంగా కొనసాగించారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం పర్షియా రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆదేశాలను అనుసరించి వారు మందిరాన్ని కట్టడం ముగించారు. రాజైన దర్యావేషు పాలనలోని ఆరవ సంవత్సరంలో అదారు నెల మూడవ రోజున మందిరం పూర్తి అయ్యింది. అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు చెర నుండి విడుదలై వచ్చిన వారందరు కలిసి ఆనందంతో మందిరాన్ని ప్రతిష్ఠించారు.

చదువండి ఎజ్రా 6