అప్పుడు యెహోవా మోషేతో, “నేను మీ కోసం ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాను. ప్రజలు ప్రతిరోజు వెళ్లి ఆ రోజుకు సరిపడే ఆహారం పోగుచేసుకోవాలి. ఆ విధంగా వారిని పరీక్షించి వారు నా ఉపదేశాలను పాటిస్తున్నారో లేదో చూస్తాను. ఆరవ రోజున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకోవాలి, అది మిగిలిన రోజుల్లో వారు సమకూర్చుకొనే దానికన్నా రెండింతలు ఉండాలి” అని చెప్పారు. కాబట్టి మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, “మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించింది యెహోవాయే అని సాయంకాలాన మీరు తెలుసుకుంటారు. ఉదయకాలం మీరు యెహోవా మహిమను చూస్తారు, ఎందుకంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా సణగడం ఆయన విన్నారు. మీరు మామీద సణగడానికి మేము ఏపాటివారం?” అన్నారు. ఇంకా మోషే మాట్లాడుతూ, “మీరు తినడానికి సాయంకాలం మాంసాన్ని, ఉదయకాలం మీకు సరిపడే ఆహారాన్ని యెహోవా మీకు ఇచ్చినప్పుడు, ఆయన యెహోవా అని మీరు తెలుసుకుంటారు, ఎందుకంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా సణగడం ఆయన విన్నారు. మేము ఏపాటివారం? మీరు మామీద సణగడం లేదు, కాని యెహోవా మీదనే సణుగుతున్నారు” అన్నాడు. తర్వాత మోషే అహరోనుతో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల సమాజమంతటికి ఇలా చెప్పు, ‘యెహోవా మీ సణుగుడు విన్నారు కాబట్టి ఆయన ఎదుటకు రండి.’ ” అహరోను ఇశ్రాయేలీయుల సమాజమంతటితో మాట్లాడుతున్నప్పుడు వారు అరణ్యం వైపు చూసినప్పుడు అక్కడ వారికి యెహోవా మహిమ మేఘంలో కనిపించింది. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నేను ఇశ్రాయేలీయుల సణుగులు విన్నాను. వారితో ఇలా చెప్పు, ‘సాయంకాలం మీరు మాంసాన్ని తింటారు, ఉదయకాలం ఆహారం తిని తృప్తిపొందుతారు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’ ” ఆ సాయంకాలం పూరేళ్ళు వచ్చి శిబిరం స్థలాన్ని కప్పివేశాయి, ఉదయకాలం ఆ శిబిరం చుట్టూ మంచు పొర ఉంది. ఆ మంచు కరిగిపోయిన తర్వాత, ఆ ఎడారి నేలమీద మంచుకణాల వంటి సన్నని కణాలు కనిపించాయి. ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, “ఇదేమిటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వారితో, “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత పోగుచేసుకోవాలి. మీ గుడారంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమెరు చొప్పున పోగుచేసుకోవాలి.’ ” ఇశ్రాయేలీయులు తమకు చెప్పబడినట్లుగానే చేశారు; కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కూర్చుకున్నారు. వారు దానిని ఓమెరుతో కొలిచినప్పుడు ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు. ప్రతిఒక్కరు తమకు ఎంత అవసరమో అంతే పోగుచేసుకున్నారు. అప్పుడు మోషే వారితో, “దీనిలో ఏది ఉదయం వరకు ఎవరూ మిగుల్చుకోకూడదు” అని చెప్పాడు. అయితే వారిలో కొందరు మోషే మాట వినిపించుకోకుండా దానిలో కొంచెం ఉదయం వరకు మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టింది. కాబట్టి మోషే వారిమీద కోపడ్డాడు.
చదువండి నిర్గమ 16
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: నిర్గమ 16:4-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు