యెహోవా మోషేతో ఇలా చెప్పారు, “ప్రతీ మొదటి మగ సంతానాన్ని నాకు ప్రతిష్ఠించండి. ఇశ్రాయేలీయుల మనుష్యుల్లోనైనా పశువుల్లోనైనా ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే.” అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు నుండి మీరు బయటకు వచ్చిన ఈ రోజును మీరు స్మారకోత్సవంగా జరుపుకోండి, ఎందుకంటే యెహోవా తన బలమైన హస్తంతో దాని నుండి మిమ్మల్ని బయటకు రప్పించారు. పులిసిన దేన్ని తినకూడదు. అబీబు అనే ఈ నెలలో ఈ రోజున మీరు బయలుదేరారు. యెహోవా కనానీయుల హిత్తీయుల అమోరీయుల హివ్వీయుల యెబూసీయుల దేశం మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని రప్పించినప్పుడు ఈ నెలలో మీరు ఈ సేవలు జరిగించాలి. ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజున యెహోవాకు పండుగ చేయాలి. ఈ ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి; పులిసినదేది మీ మధ్య కనపడకూడదు. మీ సరిహద్దుల లోపల ఎక్కడా పులిసినది కనపడకూడదు. ఆ రోజున, ‘నేను ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దానిని బట్టి నేను ఇది చేస్తున్నాను’ అని నీ కుమారునితో చెప్పాలి. యెహోవా తన బలమైన హస్తంతో మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం మీ నోటిలో ఉండేలా ఈ సంస్కారం మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక జ్ఞాపకంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నిర్ణయ కాలంలో మీరు ఈ సంస్కారాన్ని ఆచరించాలి. “యెహోవా మీకు మీ పూర్వికులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన ప్రకారం కనాను దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి దానిని మీకు ఇచ్చిన తర్వాత, ప్రతి గర్భం యొక్క మొదటి సంతానాన్ని మీరు యెహోవాకు వేరుగా ఉంచాలి. మీ పశువుల మొదటి మగపిల్లలు యెహోవాకు చెందుతాయి. ప్రతి మొదటి సంతానమైన గాడిదను గొర్రెపిల్లతో విడిపించాలి, కాని ఒకవేళ దానిని విడిపించకపోతే, దాని మెడ విరిచివేయాలి. మీ కుమారులలో మనుష్యుల ప్రతి మొదటి మగ సంతానాన్ని విడిపించుకోవాలి. “భవిష్యత్తులో మీ కుమారుడు, ‘దీని అర్థమేంటి?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వానితో ఇలా చెప్పాలి, ‘బలమైన హస్తంతో యెహోవా బానిస దేశమైన ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించారు. ఫరో మమ్మల్ని వెళ్లనివ్వకుండా తన మనస్సు కఠినం చేసుకుని నిరాకరించినప్పుడు, యెహోవా ఈజిప్టులో ఉన్న మనుష్యుల, పశువుల మొదటి సంతానమంతటిని చంపేశారు. ఆ కారణంగానే ప్రతి గర్భం యొక్క మొదటి మగ పిల్లను యెహోవాకు బలి ఇచ్చి, నా కుమారులలో ప్రతి మొదటి సంతానాన్ని విడిపించుకుంటాను.’ యెహోవా తన బలమైన హస్తంతో మమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు అనడానికి ఇది మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక ముద్రగా ఉంటుంది.”
చదువండి నిర్గమ 13
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: నిర్గమ 13:1-16
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు