నిర్గమ 12:1-13

నిర్గమ 12:1-13 TSA

యెహోవా మోషే అహరోనులతో ఈజిప్టులో ఇలా అన్నారు, “ఈ నెల మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. ఇశ్రాయేలీయుల సమాజమంతటికి చెప్పండి, ఈ నెల పదవ రోజున ప్రతి మనిషి తన కుటుంబానికి ఒక గొర్రెను తీసుకోవాలి, ప్రతి ఇంటికి ఒకటి. ఆ గొర్రెపిల్ల మొత్తాన్ని తినడానికి ఒకవేళ కుటుంబం మరీ చిన్నగా ఉంటే, దానిని తమకు అతి దగ్గరగా ఉన్న పొరుగువారితో, అక్కడ ఎంతమంది ఉన్నారో ఆ లెక్కను పరిగణలోకి దానిని పంచుకోవాలి. ప్రతి ఒక్కరు తినే పరిమాణం బట్టి మీరు గొర్రెపిల్లను ఎంచుకోవాలి. మీరు ఎంచుకున్న జంతువులు తప్పనిసరిగా ఏ లోపం లేని సంవత్సరపు మగవై ఉండాలి; వాటిని గొర్రెలలో నుండి కాని మేకలలో నుండి కాని తీసుకోవాలి. ఇశ్రాయేలు సమాజంలోని సభ్యులందరు సంధ్య సమయంలో వాటిని వధించవలసిన నెల పద్నాలుగవ రోజు వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు వారు దాని రక్తంలో కొంచెం తీసుకుని తాము గొర్రెపిల్లలను తినే వారి ఇళ్ళ ద్వారబంధాలకు రెండు పలకల మీద పూయాలి. ఆ రాత్రే వారు అగ్నిలో కాల్చబడిన ఆ మాంసాన్ని చేదు మూలికలతో, పులియని రొట్టెలతో తినాలి. ఆ మాంసాన్ని పచ్చిగా గాని లేదా నీళ్లలో ఉడకబెట్టి గాని తినకూడదు, అయితే దాని తల, కాళ్లు, లోపలి భాగాలను అగ్నిలో కాల్చి తినాలి. దానిలో దేన్ని కూడా ఉదయం వరకు మిగిలించకూడదు; ఉదయం వరకు దానిలో ఏమైనా మిగిలితే, దానిని మీరు కాల్చివేయాలి. దానిని మీరు ఇలా తినాలి: మీ నడుము కట్టుకుని, మీ పాదాలకు చెప్పులు వేసుకుని మీ చేతిలో కర్ర పట్టుకోవాలి. త్వరగా దానిని తినాలి; ఇది యెహోవా పస్కాబలి. “అదే రాత్రి నేను ఈజిప్టు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుష్యుల్లో జంతువుల్లో ప్రతి మొదటి సంతానాన్ని చంపి ఈజిప్టు దేవుళ్ళందరికి తీర్పు తీరుస్తాను. నేను యెహోవానై యున్నాను. మీరున్న ఇళ్ళ మీద ఉన్న రక్తం మీకు గుర్తుగా ఉంటుంది, నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు, మిమ్మల్ని దాటి వెళ్తాను. నేను ఈజిప్టును మొత్తినప్పుడు ఏ నాశనకరమైన తెగులు మిమ్మల్ని తాకదు.

నిర్గమ 12:1-13 కోసం వీడియో