ఎఫెసీ పత్రిక 3:11-21

ఎఫెసీ పత్రిక 3:11-21 TSA

అందుకని దేవుడు తన నిత్య సంకల్పాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చారు. ఈ విధంగా ఇప్పుడు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ గురించి నేను పడిన శ్రమలను బట్టి మీరు నిరుత్సాహపడవద్దు, అవి మీకు కీర్తి. ఈ కారణాన్ని బట్టి, తండ్రి ఎదుట నేను మోకరిస్తున్నాను, పరలోకంలోను భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఆయనను బట్టే కుటుంబమని పిలువబడుతుంది. తన మహిమ సమృద్ధి నుండి ఆయన మిమ్మల్ని మీ అంతరంగంలో తన ఆత్మ ద్వారా శక్తితో బలపరచాలని, అప్పుడు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో క్రీస్తు నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడాలని, మీరు ప్రభువు యొక్క పరిశుద్ధ ప్రజలందరితో కలిసి శక్తిని పొంది, క్రీస్తు ప్రేమ ఎంత వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఉన్నదో గ్రహిస్తూ, సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ దేవుని పరిపూర్ణతతో మీరు పూర్తిగా నింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మనలో పని చేసి తన శక్తినిబట్టి మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కొలవలేనంత అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి, సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.