ప్రసంగి 2:12-16

ప్రసంగి 2:12-16 TSA

నేను జ్ఞానం, పిచ్చితనం, బుద్ధిహీనతల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. రాజు ఇంతకుముందే చేసిన దానికంటే, రాజు తర్వాత వచ్చేవాడు అధికంగా ఇంకేమి చేయగలడు? అనుకున్నాను. చీకటి కంటే వెలుగు మేలు అని, బుద్ధిహీనత కంటే జ్ఞానం మేలు అని నేను చూశాను. జ్ఞానికి తలలో కళ్లు ఉంటాయి. మూర్ఖుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి విధి ఒకటే అని నేను గ్రహించాను. నాలో నేను అనుకున్నాను మూర్ఖుడికి సంభవించేదే నాకూ సంభవిస్తుంది. నేను ఇంత జ్ఞానం సంపాదించి నాకేం లాభం? “ఇది కూడా అర్థరహితం” అని నాలో నేననుకున్నాను. ఎందుకంటే మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడా ఎక్కువకాలం జ్ఞాపకం ఉండరు; ఇరువురిని మరచిపోయే రోజులు ఇప్పటికే వచ్చాయి. మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడ చస్తారు.