దర్యావేషు తన రాజ్యమంతటిని పాలించడానికి 120 మంది అధిపతులను నియమించాడు. వీరి మీద ముగ్గురు నిర్హాహకులను నియమించాడు, ఆ ముగ్గురిలో దానియేలు ఒకడు. రాజుకు నష్టం వాటిల్లకుండ ఆ అధిపతులు ఈ ముగ్గురికి లెక్క అప్పచెప్పాలి. అయితే దానియేలు తనకున్న గొప్ప లక్షణాలను బట్టి అధిపతులకంటే, నిర్వాహకులకంటే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి రాజు తన రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని అనుకున్నాడు. అందువల్ల నిర్వాహకులు, అధిపతులు దానియేలు మీద నేరం మోపడానికి అతని ప్రభుత్వ నిర్వహణలో లోట్ల కోసం వెదికారు కాని, అతడు నమ్మకస్థుడు, నేరం లేనివాడు. వారు అతనిలో ఎలాంటి నేరం కనుగొనలేకపోయారు. చివరికి ఈ మనుష్యులు, “ఈ దానియేలు మీద నేరం మోపడానికి ఎలాంటి కారణం ఎన్నడు మనకు దొరకదు, దొరికితే తన దేవుని ధర్మశాస్త్రం విషయంలో దొరకవచ్చు” అని అనుకున్నారు.
కాబట్టి ఈ నిర్వాహకులు, అధిపతులు గుంపుగా రాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, “రాజైన దర్యావేషు చిరకాలం జీవించు గాక! రానున్న ముప్పై రోజుల్లో ఎవరైనా మీకు తప్ప ఏ దేవునికైనా, మనిషికైనా ప్రార్థిస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని రాజు ఒక ఆదేశం జారీ చేసి, దానిని అమల్లోకి తీసుకురావాలని రాజ్య నిర్వాహకులు, ప్రముఖులు, అధిపతులు, సలహాదారులు, రాష్ట్ర అధికారులు అందరం ఏకీభవించి కోరుతున్నాము. రాజా! ఈ శాసనాన్ని ఇచ్చి, అది మాదీయుల పర్షియా చట్టం ప్రకారం అది రద్దు కాకుండా, మార్చబడకుండా ఉండేందుకు దానిని వ్రాతపూర్వకంగా ఇవ్వండి.” కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు.
అయితే ఈ శాసనం ఇవ్వబడిందని దానియేలు తెలిసినప్పటికీ అతడు ఇంటికి వెళ్లి యెరూషలేము వైపు తెరచిన కిటికీలు ఉన్న తన పైగదికి వెళ్లాడు. అతడు గతంలో చేసినట్టు, రోజుకు మూడుసార్లు మోకరించి ప్రార్థన చేస్తూ, తన దేవునికి స్తుతులు చెల్లించాడు. అప్పుడు ఈ మనుష్యులు గుంపుగా వెళ్లి, దానియేలు ప్రార్థన చేస్తూ, దేవుని సహాయం కోసం వేడుకోవడం చూశారు. కాబట్టి వారు రాజు దగ్గరకు వెళ్లి, తన రాజ శాసనం గురించి చెప్తూ, “రాజా! వచ్చే ముప్పై రోజుల వరకు మీకు తప్పా ఏ దేవునికి గాని మనిషికి గాని ప్రార్థన గాని చేయకూడదని, అలా చేస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని శాసనం ఇచ్చారు కదా?” అన్నారు.
రాజు జవాబిస్తూ, “ఆ శాసనం అమలు చేయబడుతుంది. మాదీయుల పర్షియా వారి చట్టం ప్రకారం అది రద్దు చేయబడదు” అన్నాడు.
అప్పుడు వారు రాజుతో అన్నారు, “రాజా! యూదా నుండి వచ్చిన బందీలలో ఒకడైన దానియేలు మిమ్మల్ని కాని మీరు సంతకం చేసిన శాసనాన్ని గాని లెక్క చేయట్లేదు. అతడు ఇంకా మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు.” ఇది విని రాజు చాల బాధపడ్డాడు; ఎలాగైనా దానియేలును కాపాడాలని, సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించాలని ఎంతో ప్రయత్నించాడు.
అప్పుడు ఆ మనుష్యులు రాజైన దర్యావేషు దగ్గరకు గుంపుగా వెళ్లి, “రాజా! మాదీయ పర్షియా వారి చట్టం ప్రకారం రాజు చేసిన శాసనాన్ని గాని తీర్మానాన్ని గాని ఎవరు మార్చకూడదనే విషయాన్ని మీరు గుర్తుచేసుకోవాలి” అన్నారు.
అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు.
ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు. తర్వాత రాజు భవనానికి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి వినోదాలను జరగనియ్యలేదు. అతనికి నిద్రపట్టలేదు.
తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు. రాజు సింహాల గుహ దగ్గరకు చేరుకుని దుఃఖ స్వరంతో, “దానియేలూ! సజీవ దేవుని సేవకుడా! నిత్యం నీవు సేవించే నీ దేవుడు సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగారా?” అని అన్నాడు.
దానియేలు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక!