దానియేలు 4:1-9

దానియేలు 4:1-9 TSA

రాజైన నెబుకద్నెజరు, లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక! సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు మీకు చెప్పడం నాకు ఎంతో ఆనందము. ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి! ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం; ఆయన అధికారం తరతరాలకు నిలిచి ఉంటుంది. నెబుకద్నెజరు అనే నేను, నా రాజభవనంలో హాయిగా, క్షేమంగా ఉన్నాను. నాకు ఒక కల వచ్చింది, అది నన్ను భయపెట్టింది. నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, నా మనస్సులోనికి వచ్చిన దృశ్యాలు, దర్శనాలు నన్ను భయపెట్టాయి. కాబట్టి ఆ కల భావం చెప్పడానికి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ నా ఎదుటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారు వచ్చినప్పుడు నా కల వారికి చెప్పాను. కాని వారు దాని భావం చెప్పలేకపోయారు. చివరికి, దానియేలు నా దగ్గరకు వచ్చాడు (నా దేవుని పేరైన బెల్తెషాజరు అని అతనికి పేరు పెట్టాను, ఎందుకంటే అతనిలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది) అతనికి నా కల చెప్పాను. నేను అతనితో, “శకునగాండ్రకు అధిపతివైన బెల్తెషాజరూ, పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉందని, మర్మం ఏదైనా నీకు కష్టం కాదని నాకు తెలుసు. ఇదిగో నా కల; దాని భావం నాకు చెప్పు.