నెబుకద్నెజరు రాజు ఒక బంగారు విగ్రహం చేయించి, దానిని బబులోను దేశంలో దూరా అనే మైదానంలో నిలబెట్టాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు. తర్వాత రాజైన నెబుకద్నెజరు ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ రావాలని ప్రకటించాడు. కాబట్టి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ వచ్చి దాని ఎదుట నిలబడ్డారు.
అప్పుడు దూత బిగ్గరగా ఇలా ప్రకటించాడు, “దేశాల్లారా, వివిధ భాషల ప్రజలారా, మీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇదే: బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు మీరు విన్నప్పుడు, మీరు సాగిలపడి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించాలి. దానికి సాగిలపడి పూజించని వారు వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు.”