దానియేలు 2:24-30

దానియేలు 2:24-30 TSA

అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపమని రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్లి అతనితో, “బబులోను జ్ఞానులను చంపకండి. నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్లండి, నేను అతని కల భావం అతనికి తెలియజేస్తాను” అన్నాడు. వెంటనే అర్యోకు దానియేలును రాజు దగ్గరకు తీసుకెళ్లి, “యూదా నుండి బందీలుగా వచ్చిన వారిలో రాజు కల భావం చెప్పగలవాడు నాకు దొరికాడు” అని చెప్పాడు. రాజు దానియేలును (మరో పేరు బెల్తెషాజరు), “నేను కలలో ఏమి చూశానో, దాని భావం ఏంటో చెప్పగలవా?” అని అడిగాడు. దానియేలు జవాబిస్తూ ఇలా అన్నాడు, “రాజు అడిగిన మర్మం ఏ జ్ఞాని గాని, శకునాలు చెప్పేవాడు గాని, మాంత్రికుడు గాని, జ్యోతిష్యుడు గాని చెప్పలేడు. అయితే మర్మాలు బయలుపరిచే ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే నెబుకద్నెజరు రాజుకు రాబోయే రోజుల్లో జరిగేది తెలియజేశారు. మీ మంచం మీద మీరు పడుకున్నప్పుడు మీ మనస్సులోనికి వచ్చిన మీ కల, మీ దర్శనాలు ఇవి: “రాజా! మీరు పడుకున్నప్పుడు, రాబోయే సంగతుల గురించి మీరు ఆలోచిస్తుండగా, మర్మాలను తెలిపేవాడు జరగబోయే దానిని చూపించారు. నా మట్టుకైతే, ఈ మర్మం నాకు బయలుపరచబడింది, నేను ఇతరులకంటే గొప్ప జ్ఞానం కలిగినవాడినని కాదు గాని, రాజుకు భావం తెలియజేయడానికి, మీ మనస్సులోని ఆలోచనలు మీరు గ్రహించాలని అది బయలుపరచబడింది.