కొలొస్సీ పత్రిక 3:8-15

కొలొస్సీ పత్రిక 3:8-15 TSA

కానీ ఇప్పుడైతే, మీరు కోపం, ఆగ్రహం, అసూయ, దూషణ, మీ నోటితో బూతులు మాట్లాడడం వంటి వాటిని కూడా విడిచిపెట్టండి. మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కాబట్టి ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు, సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. ఇక్కడ యూదులు అని యూదేతరులు అని, సున్నతి పొందిన వారని సున్నతి పొందని వారని, అనాగరికులని నాగరికులని, బానిసలని స్వతంత్రులని భేదం లేదు, క్రీస్తే సర్వం, అందరిలో ఆయనే ఉన్నాడు. కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి. ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి. వీటన్నిటికి పైగా, పరిపూర్ణ ఐక్యతలో బంధించే ప్రేమను ధరించుకోండి. ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి.