అపొస్తలుల కార్యములు 9:32-42

అపొస్తలుల కార్యములు 9:32-42 TCV

పేతురు దేశమంతా ప్రయాణిస్తూ, లుద్ద అనే ఊరిలో నివసిస్తున్న విశ్వాసులను కలవడానికి వచ్చాడు. అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాలుగా మంచం మీద ఉన్న ఐనెయ అనే వ్యక్తిని కలిసాడు. పేతురు అతనితో, “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరస్తున్నారు. నీవు లేచి నీ పడకను సర్దుకో” అని చెప్పిన వెంటనే ఐనెయ లేచి నిలబడ్డాడు. లుద్ద మరియు షారోనులో నివసించే వారందరు అతన్ని చూసి ప్రభువు వైపుకు తిరిగారు. యొప్పే పట్టణంలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది, గ్రీకు భాషలో ఆమెకు దొర్కా అని పేరు దానికి లేడి అని అర్థం. ఆమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ పేదలకు సహాయం చేసేది. ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయింది, కనుక ఆమె శరీరాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉంటుంది. పేతురు లుద్దలో ఉన్నాడని శిష్యులు విని “వెంటనే రమ్మని బ్రతిమాలడానికి” ఇద్దరిని అతని దగ్గరకు పంపించారు. కనుక పేతురు వారితో వెళ్లాడు, అతడు అక్కడ చేరుకొన్న తర్వాత అతన్ని మేడ గదికి తీసుకువెళ్ళారు. విధవరాండ్రందరు అతని చుట్టూ నిలబడి, ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు ఆమె తయారు చేసిన అంగీలను ఇతర వస్త్రాలను అతనికి చూపించారు. పేతురు వారందరిని గది నుండి బయటకు పంపించి, మోకరించి ప్రార్థించాడు. చనిపోయిన ఆ స్త్రీ శవం వైపు తిరిగి, “తబితా లే!” అని చెప్పాడు. ఆమె తన కళ్ళను తెరిచి పేతురును చూసి లేచి కూర్చుంది. అతడు ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు. అప్పుడు అతడు విశ్వాసులను, ముఖ్యంగా విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు. ఈ సంగతి యొప్పే పట్టణమంతా తెలిసి, చాలామంది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు.

అపొస్తలుల కార్యములు 9:32-42 కోసం వీడియో