అపొస్తలుల కార్యములు 9:20-31

అపొస్తలుల కార్యములు 9:20-31 TSA

యేసే దేవుని కుమారుడని సమాజమందిరాల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు. అతని మాటలు విన్నవారందరు ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసు పేరట ప్రార్థించిన వారిని నాశనం చేసినవాడు ఇతడే కదా? ముఖ్య యాజకుల దగ్గరకి వారిని బందీలుగా పట్టుకుని వెళ్లడానికే ఇక్కడి వచ్చాడు కదా?” అని చెప్పుకొన్నారు. అయినా సౌలు మరింత ఎక్కువ బలపడి యేసే క్రీస్తు అని రుజువుచేస్తూ దమస్కులో జీవిస్తున్న యూదులను ఆశ్చర్యపరిచాడు. చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. కాని వారి కుట్ర గురించి సౌలు తెలుసుకున్నాడు. అతన్ని చంపడానికి వారు రాత్రింబగళ్ళు పట్టణపు ద్వారాల దగ్గర చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. అయితే అతని అనుచరులు రాత్రివేళలో అతన్ని తీసుకెళ్లి గంపలో కూర్చోబెట్టి గోడలోని సందు గుండా క్రిందకు దించారు. అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు, శిష్యులతో చేరడానికి ప్రయత్నించాడు, కాని అతడు నిజమైన శిష్యుడని నమ్మలేక వారు అతనికి భయపడ్డారు. కానీ బర్నబా అతన్ని దగ్గరకు చేరదీసి అపొస్తలుల దగ్గరకు అతన్ని తీసుకువచ్చాడు. సౌలు తన ప్రయాణంలో ప్రభువును ఎలా చూశాడు, ప్రభువు అతనితో మాట్లాడిన విషయం, అతడు దమస్కులో యేసు పేరట ధైర్యంగా ఎలా బోధించాడు అనే విషయాలను వారికి చెప్పాడు. కాబట్టి సౌలు వారితో కలిసి ఉంటూ యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరట ధైర్యంగా బోధించసాగాడు. అతడు గ్రీకుభాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ వాదించాడు, అయితే వారు అతన్ని చంపాలని ప్రయత్నించారు. దీనిని గురించి తెలుసుకొన్న విశ్వాసులు, అతన్ని కైసరయకు తీసుకువచ్చి తార్సుకు పంపించారు. ఆ తర్వాత యూదయ, గలిలయ సమరయ ప్రాంతాల్లో ఉన్న సంఘం కొంత సమయం ప్రశాంతాన్ని ఆనందిస్తూ బలపడింది. దేవుని భయాన్ని కలిగి జీవిస్తూ పరిశుద్ధాత్మచేత ప్రోత్సాహింపబడి, సంఘం సంఖ్య మరింత పెరిగింది.

అపొస్తలుల కార్యములు 9:20-31 కోసం వీడియో