అపొస్తలుల కార్యములు 7:33-60

అపొస్తలుల కార్యములు 7:33-60 TSA

“అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు. ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. నేను వారి మూలుగులను విని వారిని విడిపించడానికి దిగి వచ్చాను. కాబట్టి రా! నేను నిన్ను తిరిగి ఈజిప్టు దేశానికి పంపుతాను’ అన్నారు. “ ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు?’ అని తిరస్కరించిన ఈ మోషేనే దేవుడు వారికి అధికారిగా విమోచకునిగా ఉండాలని మండుతున్న పొదలో ప్రత్యక్షమైన దేవదూత ద్వార పంపించారు. అతడు ఈజిప్టులో, ఎర్ర సముద్రం దగ్గర నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతాలను సూచకక్రియలను చేసి వారిని ఈజిప్టు నుండి బయటకు నడిపించాడు. “ఈ మోషేనే ఇశ్రాయేలీయులతో, ‘దేవుడు నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు’ అని చెప్పాడు. అతడు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి కొండమీద తనతో మాట్లాడిన దూతతో మన పితరులతో సమావేశం అయ్యాడు; మనకు అందించడానికి జీవ వాక్కులు పొందుకున్నాడు. “కానీ మన పితరులు అతనికి లోబడలేదు. పైగా అతన్ని తిరస్కరించి తమ హృదయాల్లో ఈజిప్టు వైపుకు తిరిగారు. వారు అహరోనుతో, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’ అని అన్నారు. అప్పుడు వారు ఒక దూడ రూపంలో ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. దానికి బలులను అర్పించి తమ స్వహస్తాలతో చేసిన దాని ముందు ఆనందించారు. అందుకు దేవుడు వారి నుండి దూరమై సూర్య, చంద్ర నక్షత్రాలను పూజించడానికి వారిని విడిచిపెట్టాడు. దీనిని గురించి ప్రవక్తల గ్రంథాల్లో: “ ‘ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు మీరు నాకు బలులు అర్పణలు తెచ్చారా? మీరు తయారుచేసుకున్న విగ్రహాలను పూజించారు మొలొకును దైవమని దాని గుడారాన్ని ఊరేగించారు, రెఫాను అనే మీ దేవుని నక్షత్రాన్ని పూజించారు. అందుకే నేను మిమ్మల్ని బబులోను అవతలికి బందీలుగా పంపిస్తాను’ అని వ్రాయబడి ఉంది. “దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది. ఆ గుడారాన్ని పొందుకొన్న తర్వాత, మన పితరులు యెహోషువ నాయకత్వంతో దేవుడు తమ ముందు నుండి వెళ్లగొట్టిన జనాలను నుండి స్వాధీనపరచుకున్న దేశంలోనికి తమతో పాటు దానిని తెచ్చారు. ఆ గుడారం దావీదు కాలం వరకు ఆ దేశంలోనే ఉన్నది. దావీదు దేవుని దయను అనుభవించినవాడై, యాకోబు దేవుని కోసం నివాస స్థలాన్ని ఏర్పాటుచేస్తానని దేవున్ని అడిగాడు. కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు. “అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు: “ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? అని దేవుడు అంటున్నారు నా విశ్రాంతి స్థలం ఏది? వీటన్నిటిని చేసింది నా చేయి కాదా?’ “మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా చేయించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు. న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు. కానీ స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడిచేతి వైపున యేసు నిలబడి ఉండడం చూశాడు. అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు. అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు. వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.

అపొస్తలుల కార్యములు 7:33-60 కోసం వీడియో