“ఇలాంటి రోజులలో మోషే పుట్టాడు, అతడు సామాన్యమైన బిడ్డ కాదు. మూడు నెలల వరకు అతని కుటుంబం అతన్ని కాపాడింది. అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది. మోషే ఐగుప్తీయుల విద్యలన్నింటిని నేర్చుకొని, మాటలోను, క్రియలలోను ప్రావీణ్యత సంపాదించుకున్నాడు.
“మోషేకు నలభై ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిర్ణయించుకొన్నాడు. అతడు తన జాతివారిలోని ఒకడిని ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా కొట్టడం చూసి, వానిని కాపాడి ఆ ఐగుప్తీయుని చంపి, వానికి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన సొంత జాతి ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతిని తన ప్రజలు తెలుసుకొంటారని మోషే అనుకున్నాడు కాని వారు గ్రహించలేదు. మరుసటిరోజు, పోట్లాడుకుంటున్న ఇద్దరు ఇశ్రాయేలీయుల దగ్గరకు మోషే వచ్చి వారిని సమాధానపరచాలని ప్రయత్నిస్తూ ‘అయ్యా, మీరిద్దరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరిని ఒకరు గాయపరచుకొంటున్నారు?’ అని అడిగాడు.
“అయితే గాయపరుస్తున్న వాడు మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద అధికారిగా, న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టు వానిని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అని అడిగాడు. మోషే ఆ మాట విని మిద్యాను దేశానికి పారిపోయి, అక్కడ ఒక పరదేశిగా జీవించి ఇద్దరు కుమారులను కన్నాడు.
“నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో మండుచున్న ఒక పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు కనిపించాడు. అతడు అది చూసి, ఆ దర్శనానికి ఆశ్చర్యపడి స్పష్టంగా చూడడానికి దాని దగ్గరకు వెళ్తుండగా, ‘నేను మీ పితరుల దేవుడను, నేనే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను’ అని ప్రభువు చెప్పడం అతడు విన్నాడు. కనుక మోషే భయంతో వణుకుతూ దానిని చూడడానికి సాహసించలేకపోయాడు.
“అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ పాదాల నుండి చెప్పులు విప్పు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూసాను. నేను వారి మూలుగులను విని వారిని విడిపించడానికి దిగి వచ్చాను. కనుక రా! నేను నిన్ను తిరిగి ఐగుప్తు దేశానికి పంపుతాను’ అన్నారు.
“ ‘మా మీద అధికారిగా, న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు?’ అని తిరస్కరించిన ఈ మోషేనే దేవుడు వారికి అధికారిగా మరియు విమోచకునిగా ఉండాలని మండుతున్న పొదలో ప్రత్యక్షమైన దేవదూత ద్వార పంపించారు. అతడు ఐగుప్తులో, ఎర్ర సముద్రం దగ్గర మరియు నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్బుతాలను సూచక క్రియలను చేసి వారిని ఐగుప్తు నుండి బయటకు నడిపించాడు.
“ఈ మోషేనే ఇశ్రాయేలీయులతో, ‘దేవుడు నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కొరకు లేవనెత్తుతాడు’ అని చెప్పాడు. అతడు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి కొండ మీద తనతో మాట్లాడిన దూతతో మరియు మన పితరులతో సమావేశం అయ్యాడు; మనకు అందించడానికి జీవ వాక్కులు పొందుకున్నాడు.
“కానీ మన పితరులు అతనికి లోబడలేదు. పైగా అతన్ని తిరస్కరించి తమ హృదయాల్లో ఐగుప్తు వైపుకు తిరిగారు. వారు అహరోనుతో, ‘మాకు ముందుండి నడిపించడానికి దైవాలను తయారుచేయి. ఎందుకంటే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొనివచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు’ అన్నారు. అప్పుడు వారు ఒక దూడ రూపంలో ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. దానికి బలులను అర్పించి తమ స్వహస్తాలతో చేసిన దాని ముందు ఆనందించారు. అందుకు దేవుడు వారి నుండి దూరమై సూర్య, చంద్ర మరియు నక్షత్రాలను పూజించడానికి వారిని విడిచిపెట్టాడు. దీనిని గురించి ప్రవక్తల గ్రంథాలలో:
“ ‘ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు
మీరు నాకు బలులు అర్పణలు తెచ్చారా?
మీరు తయారుచేసుకున్న విగ్రహాలను పూజించారు
మొలొకును దైవమని దాని గుడారాన్ని ఊరేగించారు,
రెఫాను అనే దేవత నక్షత్రాన్ని పూజించారు.
అందుకే నేను మిమ్మల్ని శిక్షించడానికి బబులోను అవతలకు బానిసలుగా పంపుతాను,’
అని వ్రాయబడి ఉంది.