అప్పుడు పేతురు వారిని తన అతిథులుగా ఇంట్లోకి ఆహ్వానించాడు. మరుసటిరోజు పేతురు వారితో కలిసి బయలుదేరాడు, వారితో పాటు యొప్పేలో ఉన్న కొందరు విశ్వాసులు కూడా వెళ్లారు. ఆ మరుసటిరోజు అతడు కైసరయ పట్టణం చేరాడు. కొర్నేలీ తన బంధువులను సన్నిహిత స్నేహితులను పిలిచి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు. పేతురు ఆ ఇంట్లో ప్రవేశించగానే, కొర్నేలీ అతన్ని కలుసుకొని భక్తితో అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అయితే పేతురు, “లేచి నిలబడు, నేను కూడా మనిషినే” అని చెప్పి అతన్ని పైకి లేపాడు. పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చినప్పుడు, అక్కడ చాలామంది వచ్చి ఉండడం చూశాడు. అతడు వారితో, “మీ అందరికి తెలిసినట్లే ఒక యూదుడు, యూదుడుకాని వ్యక్తితో సాంగత్యం చేయడం, వారిని కలవడం, యూదా నియమానికి విరుద్ధము. అయితే ఎవరినీ నేను అపవిత్రులని గాని నిషేధించబడిన వారని గాని పిలువకూడదని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి నీవు నన్ను పిలిచినప్పుడు ఏ అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారో నాకు చెప్పండి?” అని అడిగాడు. అందుకు కొర్నేలీ, “మూడు రోజుల క్రితం ఇదే సమయంలో అనగా మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు నేను నా ఇంట్లో ప్రార్థన చేస్తునప్పుడు అకస్మాత్తుగా మెరుస్తున్న వస్త్రాల్లో ఉన్న ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి, నాతో, ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థనలను ఆలకించాడు నీవు పేదవారికి చేసిన దానధర్మాలను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పే పట్టణంలో ఉన్న పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో అతిథిగా ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. కాబట్టి నేను వెంటనే నిన్ను పిలిపించాను, నీవు మా మధ్యకు రావడం చాలా సంతోషము. ఇప్పుడు మేమందరం దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి చేరుకొన్నాం” అని చెప్పాడు. అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు, “దేవుడు పక్షపాతం చూపించడు, కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు. యోహాను ప్రకటించిన బాప్తిస్మం తర్వాత గలిలయ ప్రాంతం మొదలుకొని యూదయ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో జరిగిన సంగతులు మీకు తెలుసు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో ఎలా అభిషేకించారో, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు ఎలా ఆయన మేలులను చేస్తూ అపవాది శక్తుల క్రింద ఉన్నవారందరిని బాగుచేస్తూ తిరిగాడో మీకు తెలుసు. “యూదయా ప్రాంతంలో యెరూషలేము పట్టణంలో యేసు చేసిన కార్యాలన్నింటికి మేము సాక్షులము. వారు ఆయనను సిలువ మీద వ్రేలాడదీసి చంపారు. కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు. ఆయన ప్రజలందరికి కనబడలేదు; కానీ దేవుడు ముందుగానే తన సాక్షులుగా ఏర్పరచుకున్నవారికి అనగా ఆయన మరణం నుండి తిరిగి జీవంతో లేచిన తర్వాత ఆయనతో పాటు తిని త్రాగిన మాకు కనబడ్డారు. దేవుడు ఆయననే సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేవానిగా నియమించారని ప్రజలకు ప్రకటించి, సాక్ష్యం ఇవ్వమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించారు. ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.” పేతురు ఇంకా ఈ మాటలను మాట్లాడుతుండగా, ఈ సందేశాన్ని విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు.
Read అపొస్తలుల కార్యములు 10
వినండి అపొస్తలుల కార్యములు 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 10:23-44
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు