2 సమూయేలు 9:3-7

2 సమూయేలు 9:3-7 TSA

అప్పుడు రాజు, “దేవుడు నాకు దయచూపించినట్లుగా నేను దయచూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు; అతని రెండు కాళ్లు కుంటివి” అని చెప్పాడు. “అతడెక్కడ ఉన్నాడు?” అని రాజు అడిగాడు. అందుకు సీబా, “అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపించి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాడు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి అతని ఎదుట తల నేలకు వంచి నమస్కరించాడు. దావీదు, “మెఫీబోషెతూ!” అని పిలిచాడు. అతడు, “నేను నీ సేవకుడిని” అని సమాధానం ఇచ్చాడు. దావీదు అతనితో, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.