అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి, యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “ప్రభువైన యెహోవా! మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది? ప్రభువైన యెహోవా! మీ దృష్టిలో ఇది చాలదన్నట్టు మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. ప్రభువైన యెహోవా! మామూలు మనుష్యుల పట్ల మీరు ఇంత కార్యం చేస్తారా? “దావీదు మీతో ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్పగలడు? ప్రభువైన యెహోవా! మీ సేవకుని గురించి మీకు తెలుసు. మీ మాట కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి మీ సేవకునికి తెలియజేశారు. “ప్రభువైన యెహోవా! మీరు ఎంత గొప్పవారు! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు. మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వారి దేవుళ్ళను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు. మీరు ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు. “ఇప్పుడు దేవా, యెహోవా! మీ సేవకునికి అతని కుటుంబానికి మీరు చేసిన వాగ్దానాన్ని ఎల్లకాలం స్థిరపరచండి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి; తద్వారా మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవాయే ఇశ్రాయేలీయుల దేవుడు’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది. “సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు దేవా, ‘నేను నీకు రాజవంశాన్ని స్థాపిస్తాను’ అని మీరు ఈ విషయాన్ని మీ సేవకునికి తెలియజేశారు. కాబట్టి మీకు ఈ ప్రార్థన ప్రార్థించడానికి మీ సేవకునికి ధైర్యం కలిగింది. ప్రభువైన యెహోవా, మీరే దేవుడు! మీ మాటలు నమ్మదగినవి. మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు. మీ సేవకుని వంశం నిత్యం మీ సన్నిధిలో ఉండేలా దీవించండి; ప్రభువైన యెహోవా, మీరు చెప్పినట్లుగా మీ దీవెనలతో మీ సేవకుని కుటుంబం శాశ్వతంగా దీవించబడుతుంది.”
Read 2 సమూయేలు 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 సమూయేలు 7:18-29
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు