2 రాజులు 6:25-33

2 రాజులు 6:25-33 TSA

సమరయలో తీవ్రమైన కరువు వచ్చింది; గాడిద తలను ఎనభై షెకెళ్ళ వెండికి, పావు కాబ్ గువ్వ రెట్టను అయిదు షెకెళ్ళ వెండికి అమ్మారు. ఒక రోజు ఇశ్రాయేలు రాజు ప్రాకారం దగ్గర నడుస్తూ ఉంటే, ఒక స్త్రీ, “నా ప్రభువా, రాజా, నాకు సహాయం చేయండి!” అంటూ కేక పెట్టింది. రాజు జవాబిస్తూ, “యెహోవా నీకు సహాయం చేయకపోతే, నేనెక్కడి నుండి సహాయం చేసేది? నూర్పిడి కళ్ళంలో నుంచా? లేదా ద్రాక్ష గానుగ నుంచా?” అన్నాడు. తర్వాత రాజు ఆమెను, “నీ సమస్య ఏంటి?” అని అడిగాడు. ఆమె, “ఒకామె నాతో, ‘నీ కుమారుని ఇవ్వు, ఈ రోజు వాన్ని తిందాం, రేపు నా కుమారుని తిందాం’ అని చెప్పింది. కాబట్టి నా కుమారుని వండుకుని తిన్నాము. మరుసటిరోజు నేను ఆమెతో, ‘నీ కుమారుని ఇవ్వు వాన్ని తిందాం’ అన్నాను, కాని ఆమె తన కుమారుని దాచుకుంది” అని చెప్పింది. రాజు ఆ స్త్రీ చెప్పింది విన్నప్పుడు, తన బట్టలు చించుకున్నాడు. అతడు ప్రాకారం దగ్గర నడుస్తూ వెళ్తున్నప్పుడు, ప్రజలు అతనిపై వస్త్రం లోపల గోనెపట్ట ఉండడం చూశారు. అతడు, “ఈ రోజు షాపాతు కుమారుడైన ఎలీషా మెడమీద అతని తల ఉంటే, దేవుడు నాకు చాలా కీడు చేయును గాక!” అన్నాడు. అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అతనితో పెద్దలు కూర్చుని ఉన్నారు. రాజు ఒక దూతను పంపాడు, కాని అతడు ఎలీషాను చేరకముందే, ఎలీషా ఆ పెద్దలతో, “ఆ హంతకుడు నా తల నరకమని మనిషిని పంపిస్తున్నాడని మీరు చూడట్లేదా? చూడండి, ఆ దూత రాగానే తలుపు మూసి అతన్ని లోపలికి రానివ్వకండి. అతని వెంట అతని యజమాని పాదాల శబ్దం వస్తుంది కదా” అని చెప్పాడు. ఎలీషా వారితో ఇంకా మాట్లాడుతుండగానే, ఆ దూత అతని దగ్గరకు వచ్చాడు. రాజు, “ఈ ఆపద యెహోవా నుండి వచ్చింది. నేను యెహోవా కోసం ఇంకా ఎందుకు కనిపెట్టాలి?” అన్నాడు.