2 దినవృత్తాంతములు 29:1-21

2 దినవృత్తాంతములు 29:1-21 TSA

హిజ్కియా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా, ఆమె జెకర్యా కుమార్తె. అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా ఆలయ ద్వారాలను తెరిచి వాటికి మరమ్మత్తు చేయించాడు. అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, వారిని ఆలయానికి తూర్పున ఉన్న విశాల స్థలంలో సమకూర్చి, వారితో ఇలా చెప్పాడు: “లేవీయులారా! నేను చెప్పేది వినండి! ఇప్పుడు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకుని, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని పవిత్రపరచండి. పరిశుద్ధాలయంలో నుండి అపవిత్రమైన ప్రతిదీ తీసివేయండి. మన తండ్రులు నమ్మకద్రోహులుగా ఉన్నారు; మన దేవుడైన యెహోవా దృష్టికి ఏది చెడ్డదో అదే చేసి, వారు ఆయనను విడిచిపెట్టారు. ఆయన నివాసస్థలం వైపు నుండి ముఖం త్రిప్పుకొని వారు ఆయనను నిర్లక్ష్యం చేశారు. వారు మండపం తలుపులు మూసివేసి, దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవునికి పరిశుద్ధాలయం దగ్గర ధూపం వేయలేదు, దహనబలులు అర్పించలేదు. కాబట్టి యెహోవా కోపం యూదా, యెరూషలేము మీద రగులుకుంది. మీరు కళ్ళారా చూస్తున్నట్లుగా ఆయన వారిని భయాందోళనలకు నిందకు గురి చేశారు. అందుకే మన తండ్రులు కత్తివేటుకు గురయ్యారు, మన కుమారులు, కుమార్తెలు మన భార్యలు వారికి బందీలుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కోపం మనమీద నుండి మళ్ళేలా ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాతో ఒడంబడిక చేయాలని ఉద్దేశించాను. నా కుమారులారా! మీరు ఆయనకు పరిచారకులుగా ఉండి ధూపం వేయాలని తన ఎదుట నిలబడి సేవ జరిగించాలని యెహోవా మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చూపకండి.” అప్పుడు ఈ లేవీయులు పనికి నియమించబడ్డారు: కహాతీయుల నుండి: అమాశై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయుల నుండి: అబ్దీ కుమారుడైన కీషు, యెహల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయుల నుండి: జిమ్మా కుమారుడైన యోవాహు, యోవాహు కుమారుడైన ఏదెను. ఎలీషాపాను సంతతి నుండి: షిమ్రీ యెహీయేలు, ఆసాపు సంతతి నుండి: జెకర్యా, మత్తన్యా, హేమాను సంతతి నుండి: యెహీయేలు, షిమీ, యెదూతూను సంతతి నుండి: షెమయా, ఉజ్జీయేలు. వారు తమ సోదరులను తోటి లేవీయులను సమకూర్చి తమను పవిత్రం చేసుకున్నారు. అప్పుడు రాజు ఆదేశించిన ప్రకారం యెహోవా వాక్కును అనుసరించి, యెహోవా మందిరం శుద్ధి చేయడానికి లోపలికి వెళ్లారు. యెహోవా గర్భాలయాన్ని శుద్ధి చేయడానికి యాజకులు లోనికి వెళ్లారు. యెహోవా మందిరంలో కనిపించిన అపవిత్రమైన ప్రతిదాన్ని వారు యెహోవా మందిరం నుండి ఆవరణంలోకి తెచ్చారు. లేవీయులు దాన్నంతా కిద్రోను లోయకు తీసుకెళ్లి పారవేశారు. మొదటి నెల మొదటి రోజున పవిత్రం చేయడం వారు ఆరంభించారు. ఆ నెల ఎనిమిదో రోజున యెహోవా మంటపం వరకు చేరారు. మరో ఎనిమిది రోజులు వారు యెహోవా మందిరాన్ని పవిత్రం చేస్తూ వచ్చారు. మొదటి నెల పదహారో రోజు ఆ పని ముగించారు. అప్పుడు వారు రాజైన హిజ్కియా దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు, “యెహోవా ఆలయమంతా మేము శుద్ధి చేశాము. దహనబలిపీఠాన్ని, దాని సామాగ్రిని, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను, దాని సామాగ్రిని శుద్ధి చేశాము. ఆహాజు రాజు తన పరిపాలనలో నమ్మకద్రోహం చేసి తొలగించిన వస్తువులన్నిటిని కూడా సిద్ధం చేసి పవిత్రపరచాము. అవి ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు ఉన్నాయి.” మరుసటిరోజు ఉదయమే లేచి రాజైన హిజ్కియా నగర అధికారులను సమకూర్చి యెహోవా ఆలయానికి వెళ్లాడు. వారు రాజ్యం కోసం, పరిశుద్ధాలయం కోసం, యూదా వారి కోసం బలిగా ఏడు కోడెలు, ఏడు పొట్టేళ్లు, ఏడు గొర్రెలు, ఏడు మేకపోతులు తెచ్చారు. అది పాపపరిహారబలిగా తెచ్చారు. అహరోను వారసులైన యాజకులను, “యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించాలి” అని రాజు ఆదేశించాడు.