2 దినవృత్తాంతములు 1:7-13

2 దినవృత్తాంతములు 1:7-13 TSA

ఆ రాత్రివేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు. అందుకు సొలొమోను దేవునితో, “మీరు నా తండ్రియైన దావీదు మీద ఎంతో దయను చూపించారు, అంతేకాక ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశారు. యెహోవా దేవా, నా తండ్రియైన దావీదుకు మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. భూమిమీది ధూళియంత విస్తారమైన ప్రజలకు నన్ను రాజుగా చేశారు. నేను ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వండి. లేకపోతే మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?” దేవుడు సొలొమోనుతో, “ఇది నీ హృదయ కోరిక, నీవు సంపదలు, ఆస్తులు గాని గౌరవాన్ని గాని నీ శత్రువుల మరణాన్ని గాని నీవు కోరలేదు, నీవు సుదీర్ఘ జీవితాన్ని కోరలేదు, కానీ ఏ ప్రజల మీద నిన్ను రాజుగా చేశానో, ఆ నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం కోరావు, కాబట్టి నీకు జ్ఞాన వివేకాలు ఇస్తాను. అంతే కాకుండా నీకు ముందున్న ఏ రాజుకు నీ తర్వాత వచ్చే రాజులకు ఉండనంత సంపదలు, ఆస్తులు, గౌరవాన్ని నేను నీకు ఇస్తాను” అని చెప్పారు. తర్వాత సొలొమోను గిబియోనులో ఉన్న సమావేశ గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుండి యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు.