ప్రభువు ప్రతిఒక్కరికి ఏ స్థితి నియమించారో, దేవుడు అందరిని ఏ స్థితిలో పిలిచారో ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలకు నియమిస్తున్నాను. అప్పటికే సున్నతి పొందినవాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పోగొట్టుకోకూడదు. సున్నతి పొందనివాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పొందకూడదు. సున్నతి పొందడంలో గాని పొందకపోవడంలో ఏమి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం. ప్రతి ఒక్కరూ దేవుడు ఏ స్థితిలో తమను పిలిచారో ఆ స్థితిలోనే ఉండాలి. పిలిచినప్పుడు నీవు దాసునిగా ఉన్నావా? దాని గురించి బాధపడవద్దు; నీవు స్వాతంత్ర్యం పొందుకోగలిగితే స్వాతంత్ర్యం పొందుకో. ప్రభువులో విశ్వాసం ఉంచడానికి పిలువబడిన దాసులు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవారు; అదే విధంగా, స్వతంత్రునిగా ఉండి పిలువబడిన వారు క్రీస్తుకు దాసులు. మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మనుష్యులకు దాసులుగా ఉండకండి. సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచి ఉండాలి. కన్యల గురించి ప్రభువు నుండి నాకు ఆజ్ఞ లేదు గాని, ప్రభువు కృప చేత నమ్మకమైన వానిగా నేను ఒక ఆలోచన చెప్తున్నాను. ఇప్పటి క్లిష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్ధితిలోనే ఉండడం మంచిదని నేను భావిస్తున్నాను. మీరు ఒక స్త్రీకి ప్రమాణం చేశారా? దాని నుండి విడుదల కోరవద్దు. మీరు అలాంటి ప్రమాణం నుండి విడుదల పొందారా? భార్య కోసం వెదకవద్దు. అయితే, మీరు పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు; కన్య పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు. అయితే పెళ్ళి చేసుకున్న వారికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, అవి మీకు కలుగకూడదని నేను కోరుతున్నాను. సహోదరీ సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, సమయం తక్కువగా ఉన్నది. కాబట్టి ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్లు జీవించండి. దుఃఖించే వారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్టు, ఏదైనా కొన్నవారు అది తమది కాదన్నట్టు ఉండాలి. ఈ లోక విషయాలతో వ్యవహరించేవారు వాటితో సంబంధం లేనివారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఉన్న ప్రస్తుత రూపం గతించిపోతుంది. మీరు చింతలేనివారై ఉండాలని నేను కోరుకొంటున్నాను. పెళ్ళికానివారు ప్రభువును ఎలా సంతోషపెట్టగలమా అని ప్రభువు విషయాల గురించి చింతిస్తారు. అయితే పెండ్లియైన వారు భార్యను ఎలా సంతోషపెట్టగలనా అని ఈ లోక విషయాల గురించి చింతిస్తున్నారు. పెళ్ళైన వారికి పెళ్ళికాని వారికి మధ్య భేదం ఉంది; పెళ్ళికాని స్త్రీ లేదా కన్య తాను శరీరంలో, ఆత్మలో పవిత్రంగా ఉండాలని ప్రభువు కార్యాలను గురించి ఆలోచిస్తుంది. కాని పెళ్ళైన స్త్రీ తన భర్తను ఎలా సంతోషపెట్టగలనా అనే ఈ లోక విషయాల గురించి ఆలోచిస్తుంది. ఇది మీ మంచి కోసమే తప్ప మిమ్మల్ని ఆటంకపరచాలని కాదు. అయితే మీరు ఇతర విషయాల మీద ధ్యాస పెట్టకుండా ప్రభువు పైనే దృష్టి నిలిపి సరియైన మార్గంలో జీవించమని చెప్తున్నాను.
చదువండి 1 కొరింథీ పత్రిక 7
వినండి 1 కొరింథీ పత్రిక 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీ పత్రిక 7:17-35
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు