1 కొరింథీ పత్రిక 7:12-24

1 కొరింథీ పత్రిక 7:12-24 TSA

మిగిలిన వారితో ప్రభువు కాదు నేను చెప్పేది ఏంటంటే: ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఆమె అతనితో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. ఏ స్త్రీకైనా అవిశ్వాసియైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయడానికి అతడు ఇష్టపడితే, ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు. అవిశ్వాసియైన భర్త, భార్య ద్వారా పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్త ద్వారా పవిత్రపరచబడుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు, ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు. అయితే అవిశ్వాసి విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. అలాంటి సందర్భాలలో ఉన్న విశ్వాసులైన సహోదరుడు లేదా సహోదరి వివాహానికి కట్టుబడి ఉండనవసరం లేదు; సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచారు. ఓ భార్యా, నీ భర్తను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ఓ భర్తా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ప్రభువు ప్రతిఒక్కరికి ఏ స్థితి నియమించారో, దేవుడు అందరిని ఏ స్థితిలో పిలిచారో ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలకు నియమిస్తున్నాను. అప్పటికే సున్నతి పొందినవాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పోగొట్టుకోకూడదు. సున్నతి పొందనివాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పొందకూడదు. సున్నతి పొందడంలో గాని పొందకపోవడంలో ఏమి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం. ప్రతి ఒక్కరూ దేవుడు ఏ స్థితిలో తమను పిలిచారో ఆ స్థితిలోనే ఉండాలి. పిలిచినప్పుడు నీవు దాసునిగా ఉన్నావా? దాని గురించి బాధపడవద్దు; నీవు స్వాతంత్ర్యం పొందుకోగలిగితే స్వాతంత్ర్యం పొందుకో. ప్రభువులో విశ్వాసం ఉంచడానికి పిలువబడిన దాసులు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవారు; అదే విధంగా, స్వతంత్రునిగా ఉండి పిలువబడిన వారు క్రీస్తుకు దాసులు. మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మనుష్యులకు దాసులుగా ఉండకండి. సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచి ఉండాలి.