మీరు వ్రాసిన విషయాల గురించి: “స్త్రీతో లైంగిక సంబంధం లేకపోవడం పురుషునికి మంచిది.” అయితే లైంగిక దుర్నీతి జరుగుతుంది కాబట్టి ప్రతి పురుషుడు తన సొంత భార్యతోనే, ప్రతి స్త్రీ తన సొంత భర్తతోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి. భర్త తన భార్య పట్ల వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి, అదే విధంగా భార్య తన భర్తకు వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి. భార్య శరీరం మీద ఆమె భర్తకే గాని ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద భార్యకే గాని అతనికి అధికారం లేదు. మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండ మీరు తిరిగి కలుసుకోండి. ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు. మీరందరు నాలా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, మీలో ప్రతి ఒక్కరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చారు; ఒకరికి ఒక వరం, ఇంకొకరికి ఇంకొక వరాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను పెళ్ళికానివారితో, విధవరాండ్రతో చెప్పేది ఏంటంటే: నాలా వారు కూడ పెళ్ళి చేసుకోకుండా ఉండడం మంచిది. అయితే వారు తమను తాము అదుపు చేసుకోలేకపోతే పెళ్ళి చేసుకోవాలి. కామంతో రగిలిపోవడం కంటే పెళ్ళి చేసుకోవడం మేలు. పెళ్ళి అయినవారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించేది ఏంటంటే: భార్య భర్తనుండి వేరుగా ఉండకూడదు. అయితే ఆమె అలా వేరైతే, ఆమె పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవాలి లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు. మిగిలిన వారితో ప్రభువు కాదు నేను చెప్పేది ఏంటంటే: ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఆమె అతనితో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. ఏ స్త్రీకైనా అవిశ్వాసియైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయడానికి అతడు ఇష్టపడితే, ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు. అవిశ్వాసియైన భర్త, భార్య ద్వారా పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్త ద్వారా పవిత్రపరచబడుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు, ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు. అయితే అవిశ్వాసి విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. అలాంటి సందర్భాలలో ఉన్న విశ్వాసులైన సహోదరుడు లేదా సహోదరి వివాహానికి కట్టుబడి ఉండనవసరం లేదు; సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచారు. ఓ భార్యా, నీ భర్తను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ఓ భర్తా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ప్రభువు ప్రతిఒక్కరికి ఏ స్థితి నియమించారో, దేవుడు అందరిని ఏ స్థితిలో పిలిచారో ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలకు నియమిస్తున్నాను. అప్పటికే సున్నతి పొందినవాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పోగొట్టుకోకూడదు. సున్నతి పొందనివాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పొందకూడదు. సున్నతి పొందడంలో గాని పొందకపోవడంలో ఏమి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం. ప్రతి ఒక్కరూ దేవుడు ఏ స్థితిలో తమను పిలిచారో ఆ స్థితిలోనే ఉండాలి. పిలిచినప్పుడు నీవు దాసునిగా ఉన్నావా? దాని గురించి బాధపడవద్దు; నీవు స్వాతంత్ర్యం పొందుకోగలిగితే స్వాతంత్ర్యం పొందుకో. ప్రభువులో విశ్వాసం ఉంచడానికి పిలువబడిన దాసులు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవారు; అదే విధంగా, స్వతంత్రునిగా ఉండి పిలువబడిన వారు క్రీస్తుకు దాసులు. మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మనుష్యులకు దాసులుగా ఉండకండి. సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచి ఉండాలి.
చదువండి 1 కొరింథీ పత్రిక 7
వినండి 1 కొరింథీ పత్రిక 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీ పత్రిక 7:1-24
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు