ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి ఉంది: “ఇతర భాషలతో పరదేశీయుల పెదాలతో నేను ఈ ప్రజలతో మాట్లాడతాను, కాని వారు నా మాట వినరు, అని ప్రభువు పలుకుతున్నాడు.” కాబట్టి భాషలతో మాట్లాడడం అనేది విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన. అయితే ప్రవచించడం అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచన. ఒకవేళ సంఘమంతా ఒకచోట చేరి అందరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు గ్రహించలేనివారు గాని అవిశ్వాసులు గాని లోపలికి వస్తే, మీరందరు పిచ్చివారిలా మాట్లాడుతున్నారని అనుకుంటారు కదా? కాని, అందరు ప్రవచిస్తే అవిశ్వాసి కాని, తెలియనివారు కాని లోపలికి వస్తే తాము విన్నదానిని బట్టి వారు తాము పాపులమని గ్రహించి అందరిని బట్టి వారు తీర్పుపొందుతారు. వారి హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. వారు సాగిలపడి దేవున్ని ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా మీ మధ్యలో ఉన్నాడు!” అని అంగీకరిస్తారు. సహోదరీ సహోదరులారా, మేము ఇక ఏమి చెప్పాలి? మీరు సమావేశమైనప్పుడు, మీలో ఒకరు కీర్తన పాడాలని, ఒకరు బోధించాలని, ఒకరు దేవుడు బయలుపరచిన దాన్ని ప్రకటించాలని, ఒకరు భాషలతో మాట్లాడాలని, ఒకడు దానికి అర్థం చెప్పాలని తలస్తున్నారు. కాని ఇవన్నీ సంఘాన్ని బలపరచడానికి చేయండి. భాషల్లో మాట్లాడాలనుకున్నవారు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. మరొకరు దాని అర్థాన్ని వివరించాలి. అయితే అర్థాన్ని వివరించగలవారు ఎవరూ లేకపోతే, భాషలు మాట్లాడేవారు సంఘంలో మౌనంగా ఉండి, తనలో తాను దేవునితోను మాత్రమే మాట్లాడుకోవాలి. ప్రవక్తల్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి. సమావేశంలో కూర్చున్నవారిలో ఎవరైనా దేవుని నుండి ప్రత్యక్షతను పొందితే, మాట్లాడుతున్నవారు తన మాటలు ఆపివేయాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రోత్సహించబడేలా మీరందరు ఒకరి తర్వాత ఒకరు ప్రవచించాలి. ప్రవక్తల ఆత్మ ప్రవక్తలకు లోబడి ఉండాలి. అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు. స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి. వారు మాట్లాడడానికి అనుమతి లేదు కాని ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా వారు వినయం కలిగి ఉండాలి. వారు ఏదైనా తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర తమ భర్తలను అడగాలి; సంఘంలో మాట్లాడడం స్త్రీకి అవమానకరం. దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేదా అది మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా? ఎవరైనా తాము దేవుని ప్రవక్తలమని లేదా ఆత్మ వరాలు గల వారమని తలిస్తే, నేను మీకు వ్రాసేది ప్రభువు ఆజ్ఞ అని వారు గ్రహించాలి. కాని, ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు నిర్లక్ష్యం చేయబడినవారిగానే ఉంటారు. కాబట్టి నా సహోదరీ సహోదరులారా, ప్రవచించడాన్ని ఆసక్తితో కోరుకోండి, భాషలతో మాట్లాడడాన్ని ఆటంకపరచకండి. అయితే సమస్తం మర్యాదగా క్రమంగా జరుగనివ్వండి.
చదువండి 1 కొరింథీ పత్రిక 14
వినండి 1 కొరింథీ పత్రిక 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీ పత్రిక 14:21-40
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు