1 కొరింథీ పత్రిక 11:1-15

1 కొరింథీ పత్రిక 11:1-15 TSA

నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి. మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, మీకు నేను మీకు అప్పగించిన సంప్రదాయాలను అలాగే కొనసాగిస్తున్నందుకు నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. అయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఏ పురుషుడైనా తన తలమీద ముసుగు వేసుకుని ప్రార్థించినా లేదా ప్రవచించినా అతడు తన తలను అవమానిస్తున్నాడు. అయితే ఏ స్త్రీయైనా తలమీద ముసుగు వేసుకోకుండా ప్రార్థించినా లేదా ప్రవచించినా ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తున్నట్టే. అలా చేస్తే ఆమె తలను క్షౌరం చేసుకున్నట్టే. స్త్రీ తన తలపై ముసుగు వేసుకోకపోతే, తన వెంట్రుకలను కత్తిరించుకోవాలి. అయితే వెంట్రుకలు కత్తిరించుకోవడం గాని లేదా తల క్షౌరం చేయించుకోవడం స్త్రీకి అవమానంగా అనిపిస్తే ఆమె తలపై ముసుగు వేసుకోవాలి. పురుషుడు దేవుని పోలికగా మహిమగా ఉన్నాడు కాబట్టి అతడు తన తలపై ముసుగు వేసుకోకూడదు; కాని స్త్రీ పురుషునికి మహిమగా ఉంది. ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది. పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది. ఈ కారణంగా, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలపై ఉండాలి. అయితే, ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు. పురుషుని నుండి స్త్రీ ఎలా కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ నుండి జన్మిస్తున్నాడు. అయితే సమస్తం దేవుని నుండి వచ్చాయి. మీకు మీరే ఆలోచించుకోండి; స్త్రీ తలపై ముసుగు వేసుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరియైనదేనా? పురుషునికి పొడవైన వెంట్రుకలు ఉండడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపిస్తుంది కదా? అయితే స్త్రీకి పొడవైన జుట్టు ఆమె తలను కప్పుకోడానికి పైటచెంగుగా ఇవ్వబడింది కాబట్టి పొడవైన జుట్టు కలిగి ఉండడం ఆమెకు గౌరవం కాదా?