జెకర్యా 13:2-9

జెకర్యా 13:2-9 TERV

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో విగ్రహాలన్నిటినీ భూమిపైనుండి తొలగిస్తాను. ప్రజలు కనీసం వాటి పేర్లయినా గుర్తు పెట్టుకోలేరు. ఈ భూమిపైనుండి బూటకపు ప్రవక్తలను, మురికి దయ్యాలను నేను తొలగిస్తాను. ఎవ్వరైనా భవిష్య ప్రకటనలు చేస్తే అట్టి వ్యక్తి శిక్షింపబడతాడు. అతని తల్లిదండ్రులు సహితం అతనితో, ‘యెహోవా పేరుమీద నీవు అబద్ధాలు చెప్పావు. కావున నీవు తప్పక చనిపోవాలి!’ అని అంటారు. అతని స్వంత తల్లిదండ్రులు అతడు భవిష్య ప్రకటనలు చేసినందుకు కత్తితో పొడుస్తారు. అప్పుడు ప్రవక్తలు తమ దర్శనాలపట్ల, తమ ప్రకటనలపట్ల సిగ్గు చెందుతారు. తాము ప్రవక్తలమని తెలియజేసే ముతక బట్టను వారు ధరించరు. భవిష్య ప్రకటనల పేరుతో అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించటానికి వారు ఆ బట్టలు ధరించరు. ఆ జనులు ఇలా అంటారు: ‘నేను ప్రవక్తను కాను. నేనొక వ్యవసాయదారుడిని. నా చిన్నతనంనుండి నేను వ్యవసాయదారునిగానే పని చేశాను.’ ‘అయితే, నీ చేతులమీద ఈ గాయాలు ఏమిటి?’ అని ఇతరులు అడుగుతారు. అందుకతడు, ‘నా స్నేహితుల ఇంటిలో నాకు దెబ్బలు తగిలాయి’ అని అంటాడు.” సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “ఖడ్గమా, గొర్రెల కాపరిని నరుకు! నా స్నేహితుని నరుకు! కాపరిని నరుకు! గొర్రెలన్నీ పారిపోతాయి. నేను ఆ చిన్నవాటిని శిక్షిస్తాను. దేశ జనాభాలో మూడింట రెండు వంతులు బాధింపబడగా చనిపోతారు. మూడింట ఒకవంతు బతుకుతారు. చనిపోగా మిగిలినవారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను ఎన్నో కష్టాలు కలుగ జేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు వుంటాయి. ఒకడు బంగారాన్ని పరీక్ష చేసినట్లు నేను వారిని పరీక్ష చేస్తాను. అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. నేను వారికి సమాధానమిస్తాను. ‘మీరు నా ప్రజలు’ అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: ‘యెహోవా మా దేవుడు.’”