పరమ గీతము 4:8-14

పరమ గీతము 4:8-14 TERV

నా వధువా! లెబానోను నుండి నాతోరా! లెబానోనునుండి నాతోరా. అమాన పర్వత శిఖరాన్నుండి శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి సింహపు గుహల నుండి చిరుత పులుల పర్వతాలనుండి రమ్ము! నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నన్ను ఉద్రేక పరుస్తావు. ఒకే ఒక చూపుతో నీ హారంలోని ఒకే ఒక రత్నంతో నా హృదయాన్ని దోచుకున్నావు. నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీ ప్రేమ చాలా సుందరమైనది ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ మధురమైంది, నీ పరిమళ ద్రవ్యపు సువాసన ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది! నా ప్రియవధువా, నీ పెదవులు తేనె లూరుతున్నాయి నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారుతున్నాయి నీ దుస్తులు మధుర పరిమళాన్ని గుబాళిస్తున్నాయి. నా నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నిష్కళంకురాలివి. మూయబడిన ఉద్యానవనం వలె, మూయబడిన జలాశయంవలె, మూయబడిన జలధారలవలె స్వచ్ఛమైనదానవు. నీ శరీరమొక తోటను పోలినది దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి, కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో నిండిన సుందర వనాన్ని పోలినది.