కీర్తనల గ్రంథము 89:1-18

కీర్తనల గ్రంథము 89:1-18 TERV

యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను. ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను! యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను. నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది! దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను. నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను. ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను. నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’” యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది. పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు. “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు. యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు. వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు. మేము నిన్ను పూర్తిగా నమ్మగలము. ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు. దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు. దేవా, నీవు రహబును ఓడించావు. నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు. దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే. ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు. ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు. తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి. దేవా, నీకు శక్తి ఉంది! నీ శక్తి గొప్పది! విజయం నీదే! సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది. ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు. దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు. వారు నీ దయ వెలుగులో జీవిస్తారు. నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది. వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు. నీవే వారి అద్భుత శక్తివి, వారి శక్తి నీ నుండే లభిస్తుంది. యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.