కీర్తనల గ్రంథము 86:11-17

కీర్తనల గ్రంథము 86:11-17 TERV

యెహోవా, నీ మార్గాలు నాకు నేర్పించు నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను. నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా అతి ముఖ్యాంశంగా చేయుము. దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను. దేవా, నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు. దేవా, గర్విష్ఠులు నాపై పడుతున్నారు. కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు. ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు. నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు. దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము. నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను. నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను. దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము. అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు. ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.