కీర్తనల గ్రంథము 78:56-72

కీర్తనల గ్రంథము 78:56-72 TERV

కాని ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు. ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లుకొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మకస్తులుగాను ఉన్నారు. వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు. ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు. దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు. దేవుడు ఇది విని చాలా కోపగించాడు. మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు. షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం. అప్పుడు దేవుడు ఇతర రాజ్యాలు తన ప్రజలను బంధీలుగా చేయనిచ్చాడు. దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు. తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు. ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు. యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు. పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు. యాజకులు చంపివేయబడ్డారు. కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు. త్రాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె, నిద్రనుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు. దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు. దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు. కాని యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు. ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు. దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు. మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు. ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు. భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు. తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు. దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు. గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి, తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు. మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.