కీర్తనల గ్రంథము 34:11-22

కీర్తనల గ్రంథము 34:11-22 TERV

పిల్లలారా, నా మాట వినండి. యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను. ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే, ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు, చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి. శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి. మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. ఆయన వారి ప్రార్థనలు వింటాడు. కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు. ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు. ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు. ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు. గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు. ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు. మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు. కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు. వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు. ఒక్క ఎముక కూడా విరువబడదు. అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి. చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు. యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు. తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.