యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను. ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి. ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి. ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి. ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు. యెహోవా వారిని ద్వేషించడు. ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు. యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది. నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను. పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు. యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి. మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక! దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఆయన వద్దకు తిరిగి వస్తారు. ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు. నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు. సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు. మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు. చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి. భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు. యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు. ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు. దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
చదువండి కీర్తనల గ్రంథము 22
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనల గ్రంథము 22:22-31
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు