కీర్తనల గ్రంథము 18:16-36

కీర్తనల గ్రంథము 18:16-36 TERV

పై నుండి యెహోవా క్రిందికి అందుకొని నన్ను రక్షించాడు. నా కష్టాల్లోనుండి ఆయన నన్ను బయటకు లాగాడు. నా శత్రువులు నాకంటె బలవంతులు. ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె చాలా బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు. నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు. కాని యెహోవా నన్ను బలపర్చాడు. యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు. ఆయన నన్ను క్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు. నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు. నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు. నేను యెహోవాను అనుసరించాను. నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు. యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు. ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను. నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను. నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు. నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు. యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మదగినవాడవు. మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు. యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైనవాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైనవాడవు. కాని, గర్విష్ఠులను, టక్కరివాళ్లను నీవు అణచివేస్తావు. యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు. కాని గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు. యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు. నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు. యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను. నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను. దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం. ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు. యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు. మన దేవుడు తప్ప మరో బండ లేదు. దేవుడు నాకు బలం ఇస్తాడు. ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు. దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె ఉంచుతాడు. ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు. ఎత్తయిన బండలమీద పడకుండా ఆయన నన్ను కాపాడుతాడు. యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడు. ఇత్తడి విల్లును ఎక్కు పెట్టుటకు నా చేతులకు ఆయన బలాన్ని ఇస్తాడు. దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి. నీ కుడిచేతితో నన్ను బలపరుచుము. నీ సహాయం నన్ను గొప్పవానిగా చేసినది. నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. నా పాదాలు జారిపోలేదు.