కీర్తనల గ్రంథము 119:49-104

కీర్తనల గ్రంథము 119:49-104 TERV

యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము. ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది. నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి. నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు. కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి. నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. నీ న్యాయ చట్టాలు నా ఇంటివద్ద పాడుకొనే పాటలు. యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను. నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను. నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను కనుక నాకు ఈలాగు జరుగుతుంది. యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను. యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను. నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము. నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను. మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను. ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను. దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు. అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు. నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను. నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను. నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను. యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు. నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు. యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు. నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను. నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను. కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను. దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు. కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను. ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు. నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం. శ్రమపడటం నాకు మంచిది. నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి. వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి. యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు. నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు. నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం. యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు. నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే. ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము. యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బ్రతుకనిమ్ము. నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను. నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు. యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్యయనం చేస్తాను. నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము. అందుచేత నేను అవమానించబడను. నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను. కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను. నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి. యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు? నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు. నేను ఎంత కాలం జీవిస్తాను? యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు. మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం. యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు. అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము! ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు. నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు. యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము. నీవు చెప్పే వాటిని నేను చేస్తాను. యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది. నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు. యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది. నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి. యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి. నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే, నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది. యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను. యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము. ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను. దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు. అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది. నీ ధర్మశాస్త్రానికి తప్ప ప్రతిదానికీ ఒక హద్దు ఉంది. నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో! దినమంతా అదే నా ధ్యానం. నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే జ్ఞానవంతునిగా చేస్తుంది. నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది. ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి. ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను. కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను. నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను. యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను. నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం. నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి, అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.