కీర్తనల గ్రంథము 119:145-160

కీర్తనల గ్రంథము 119:145-160 TERV

యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను. నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను. యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము. నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను. యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను. నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను. నీ వాక్యాన్ని ధ్యానించుటకు నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను. నీవు దయతో నా మాట విను. యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము. మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు. యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి. నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను. యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము. నీ ఉపదేశాలను నేను మరువలేదు. యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము. నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము. దుష్టులు జయించరు. ఎందుకంటే, వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు. యెహోవా, నీవు చాలా దయగలవాడవు. నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు. కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు. ఆ ద్రోహులను నేను చూస్తున్నాను. ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు. చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను. యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము. యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి. నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.