కీర్తనల గ్రంథము 106:7-21

కీర్తనల గ్రంథము 106:7-21 TERV

యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు. ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి విరోధంగా ఎదురు తిరిగారు. అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు, ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది. దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు. మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు. వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు. అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు. వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు! అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు. వారు ఆయనకు స్తుతులు పాడారు. కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు. వారు దేవుని సలహా వినలేదు. మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు. అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు. కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారికి ఇచ్చాడు. అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు. ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు. యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు. కనుక ఆ అసూయపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది. తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది. అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది. ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది. హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు. వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు. ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని వారి మహిమ గల దేవునిగా మార్చేశారు. మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు. ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.