కీర్తనల గ్రంథము 106:34-48

కీర్తనల గ్రంథము 106:34-48 TERV

కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు. ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు. ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు. ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు. దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు. దేవుని ప్రజలు నిర్దోషులను చంపివేసారు. వారు తమ స్వంత బిడ్డలనే చంపి ఆ బూటకపు దేవుళ్లకు అర్పించారు. కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు. దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు. దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది. దేవుడు వారితో విసిగిపోయాడు! దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు. వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు. దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని వారికి జీవితాన్నే కష్టతరం చేసారు. దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు. కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు. దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు. కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు. ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు. ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు. అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు. మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు. నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము. అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి. దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు. మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.