కీర్తనల గ్రంథము 104:18-35

కీర్తనల గ్రంథము 104:18-35 TERV

పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం, పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు. దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము. ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు. చీకటిని నీవు రాత్రిగా చేశావు. ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి. సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి. అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను అడుగుతున్నట్టు ఉంటుంది. మరల సూర్యుడు ఉదయించినప్పుడు ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి. అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు. సాయంత్రం వరకు వారు పని చేస్తారు. యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు. భూమి నీ కార్యాలతో నిండిపోయింది. నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు. మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది. మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి. మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి. మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి. నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం ఆ సముద్రంలో ఆడుకుంటుంది. దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు. దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు. మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి. నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు అవి భయపడిపోతాయి. వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి. మరియు అవి మరల మట్టి అయిపోతాయి. కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి మరల క్రొత్తదిగా అవుతుంది. యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక. యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక. యెహోవా భూమివైపు చూసేటప్పుడు అది వణకుతుంది. ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది. నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను. నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను. నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను. భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక. దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!