నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు. మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు. ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు. ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు. దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు. దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు. గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు. దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు. నీ సేవకులను అగ్నిలా చేశావు. దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు. కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు. దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు. నీళ్లు పర్వతాలను కప్పివేశాయి. కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి. దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి. పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి. సముద్రానికి నీవు హద్దులు నియమించావు. నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు. దేవా, నీటి ఊటలనుండి నీటి కాలువలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు. పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని క్రిందికి కాలువలా ప్రవహింపజేసావు. నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి. అక్కడ నీళ్లు త్రాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి. నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి. సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి. దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు. దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి. దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు. మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం. దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు. మా చర్మాన్ని నునుపు చేసే తైలాన్ని నీవు మాకిస్తావు. మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు. లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు. ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి. పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి. పెద్ద కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
చదువండి కీర్తనల గ్రంథము 104
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనల గ్రంథము 104:1-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు