సామెతలు 8:14-26

సామెతలు 8:14-26 TERV

కాని మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను. తెలివిని, శక్తిని నేను వారికి ఇస్తాను! రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు. న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు. భూమిమీద ప్రతి మంచి పాలకుడూ తన క్రింద ఉన్న ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు. నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను. నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు. నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను. నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి. నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి. నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను. సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను. నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను. అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను. “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట యెహోవాచేత చేయబడింది నేనే నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను. నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను. నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను. నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను. యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను. ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను.