సామెతలు 4:11-18

సామెతలు 4:11-18 TERV

జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్పిస్తున్నాను. నేను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను. ఈ మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా ఉంటావు. ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు జీవం! దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. దుర్మార్గానికి దూరంగా ఉండు. దానికి దగ్గరగా వెళ్లవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్లిపో. చెడ్డవాళ్లు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు మరో వ్యక్తిని బాధించేటంతవరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు దౌర్జన్యము అనే మద్యం తాగుతూ దుర్మార్గము అనే రొట్టెను తింటారు. ఇతరులను బాధించకుండా జీవించలేరు. మంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయమౌతుంది. ఆ రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది.