సామెతలు 27:14-27

సామెతలు 27:14-27 TERV

“శుభోదయం” అని గట్టిగా అరుస్తూ తెల్లవారకట్లనే నీ పొరుగు వారిని మేలుకొలుపవద్దు. అది అతనికి ఒక శాపం అనుకుంటాడే కాని దీవెన అనుకోడు. ఎప్పుడూ వివాదం పెట్టుకోవాలని చూచే భార్య వర్షపు రోజున ఆగకుండా కురిసే చినుకుల్లాంటిది. ఆ స్త్రీని వారించటం పెను గాలిని వారించ ప్రయత్నించినట్టే ఉంటుంది. అది నీ చేతితో నూనె పిండేందుకు ప్రయత్నించినట్టు ఉంటుంది. ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప ముక్కలను మనుష్యులు వాడుతారు. అదే విధంగా మనుష్యులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరిని ఒకరు పదును చేస్తారు. అంజూరపు చెట్ల విషయం శ్రద్ధగలవాడు దాని ఫలాలు తినగలుగుతాడు. అదే విధంగా తన యజమానుని విషయమై శ్రద్ధగలవాడు ప్రతిఫలం పొందుతాడు. అతని యజమాని అతని గూర్చి శ్రద్ధ పుచ్చుకుంటాడు. ఒక మనిషి నీళ్లలోనికి చూసినప్పుడు అతడు తన స్వంత ముఖాన్నే చూడగలుగుతాడు. అదే విధంగా ఒక మనిషి హృదయం నిజానికి అతడు ఎలాంటివాడో తెలియచేస్తుంది. మరణస్థానం మరియు నాశన స్థలము ఎన్నటికీ తృప్తిపడవు. మానవుని కన్నులు కూడ ఎన్నటికీ తృప్తినొందవు. బంగారాన్ని, వెండిని శుద్ధి చేయటానికి మనుష్యులు అగ్నిని ఉపయోగిస్తారు. అదే విధంగా ఒక మనిషికి ప్రజలు ఇచ్చే మెప్పుద్వారా అతడు పరీక్షించబడతాడు. ఒక బుద్ధిహీనుని నీవు పొడుంగా నూర్చినా అతనిలోని తెలివి తక్కువ తనాన్ని నీవు బయటకు నెట్టివేయలేవు. నీ గొర్రెలను, పశువులను జాగ్రత్తగా చూసుకో, నీకు చేతనైనంత బాగా వాటిని గూర్చి శ్రద్ధ తీసికో. ఐశ్వర్యం శాశ్వతంగా ఉండదు. రాజ్యాలు కూడా శాశ్వతంగా ఉండవు. మనుష్యులు ఎండుగడ్డి కోస్తే కొత్త గడ్డి పెరగటం మొదలవుతుంది. తరువాత కొండల మీద వెరుగుతున్న ఆ గడ్డిని వారు కోస్తారు. (అందుచేత నీకు ఉన్న దానితో సంతృప్తిగా ఉండు.) నీ గొర్రెపిల్లల బొచ్చు నుండి నీవు బట్టలు చేసికోవచ్చు. నీ మేకలు అమ్మగా వచ్చిన డబ్బుతో నీవు భూమి కొనవచ్చును. మిగిలిన నీ మేకలు సమృద్ధిగా పాలు ఇస్తాయి. కనుక నీకు, నీ కుటుంబానికి కూడా సరిపడినంత ఆహారం ఉంటుంది. నీ దాసీలను ఆరోగ్యవంతులుగా చేస్తుంది.