సామెతలు 24:5-14

సామెతలు 24:5-14 TERV

జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది. నీవు యుద్ధం ప్రారంభించక ముందు జాగ్రత్తగా పథకాలు వేయాలి. నీవు విజయం కావాలి అని అనుకొంటే నీకు మంచి సలహాదారులు చాలా మంది ఉండాలి. బుద్ధిహీనులు జ్ఞానమును గ్రహించలేరు. మనుష్యులు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు బుద్దిహీనులు ఏమీ చెప్పలేరు. నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలుస్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు. బుద్ధిహీనుడు చేయాలని తలపెట్టే విషయాలు పాపం. ఇతరుల కంటే తానే మంచి వాడిని అనుకోనే మనిషిని ప్రజలు అసహ్యించుకొంటారు. కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే. మనుష్యులు ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తూంటే నీవు వానిని రక్షించుటకు ప్రయత్నించాలి. “ఇది నా పని కాదు” అని నీవు చెప్పకూడదు. యెహోవాకు అంతా తెలుసు. నీవు వాటిని ఎందుకు చేస్తావో ఆయనకు తెలుసు. యెహోవా నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. నీవు చేసే పనులకు యెహోవా నీకు బహుమానం ఇస్తాడు. నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది. అదే విధంగా జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం ఉండదు.