సామెతలు 21:17-26

సామెతలు 21:17-26 TERV

ఒక మనిషికి సరదా మాత్రమే అతి ముఖ్యం అయితే ఆ మనిషి దరిద్రుడు అవుతాడు. ఒకవేళ అతడు ద్రాక్షారస, భోజన ప్రియుడు అయితే అతడు ఎన్నటికీ ధనికుడు కాలేడు. మంచి మనుష్యులకు దుర్మార్గులు చేసే దుర్మార్గపు పనులన్నిటికీ తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నిజాయితీ లేని మనుష్యులు నిజాయితీగల వాళ్లకు చేసే వాటన్నింటికీ శిక్ష చెల్లించాల్సి ఉంటుంది. వివాదం అంటే మక్కువ పడే కోపిష్టి భార్యతో ఉండటంకంటే ఎడారిలో నివసించటం మేలు. జ్ఞానము గలవాడు తనకు అవసరమైన వాటిని భద్రం చేసికొంటాడు. కాని తెలివి తక్కువవాడు దొరికిన దాన్ని దొరికినంత త్వరగానే వాడేస్తాడు. ఎల్లప్పుడూ ప్రేమ, దయ చూపించాలని ప్రయత్నించే మనిషి మంచి జీవితం, ఐశ్వర్యం, ఘనత కలిగి ఉంటాడు. జ్ఞానముగలవాడు దాదాపు ఏదైనా చేయగలడు. బలంగల మనుష్యులు కాపలా కాస్తున్న పట్టణంపై అతడు దాడి చేయగలడు. వారిని కాపాడుతాయని నమ్ముకొన్న గోడలను అతడు నాశనం చేయగలడు. ఒక మనిషి అతడు చేప్పే విషయాలలో జాగ్రత్తగా ఉంటే అతడు కష్టం నుండి తనను తాను తప్పించుకోగలడు. ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే వాడు గర్విష్ఠి. తాను చేసే పనుల ద్వారా అతడు తను దుర్మార్గుడని చూపిస్తాడు. సోమరి తను ఇంకా ఇంకా కావాలని కోరినప్పుడు తనను తానే నాశనం చేసికొంటాడు. అతడు వాటికోసం పనిచేసేందుకు నిరాకరిస్తాడు గనుక, తనను తానే నాశనం చేసికొంటాడు. కాని మంచి మనిషికి పుష్కలంగా ఉంటుంది గనుక అతడు యివ్వగలడు.